శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్యపై విచారణ.. ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీచేసిన సబితా ఇంద్రారెడ్డి..

By SumaBala Bukka  |  First Published Mar 1, 2023, 12:37 PM IST

నార్సింగిలో శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్యపై విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. ఘటన దురదృష్టకరం అన్నారు. 


హైదరాబాద్ : హైదరాబాదులోని నార్సింగిలో  శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది. క్లాస్ రూమ్ లోనే  ఉరేసుకొని సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీద విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థి మరణంపై విచారణకు ఆదేశించారు మంత్రి. ఘటనపై విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని కోరారు.  ఇలాంటి ఘటన విషాదకరమని తెలిపారు. పరీక్షల విషయంలో విద్యార్థులపై ఒత్తిడిని తొలగించడం కోసమే ఎంసెట్లోనూ మార్కుల ర్యాంకులను తొలగించామని అన్నారు. 

ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్ తో పాటు మేనేజ్మెంట్ పై కూడా కేసులు నమోదు చేశారు. సెక్షన్ 305ఫై కింద పోలీసులుఈ ఘటనలో కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రులు కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాత్విక్ కుటుంబసభ్యులు, తల్లి  ఆందోళనకు బైఠాయించారు. వీరికి  విద్యార్థులు తోడయ్యారు.

Latest Videos

అవే సాత్విక్ చివరి మాటలు: కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి రాజు

సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో కాలేజీకి సెలవులు ప్రకటించారు.  దీంతో హాస్టల్ నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కాలేజీలో జరుగుతున్న హరాస్మెంట్ మీద విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దాని మీద మాట్లాడితే తమను కూడా టార్గెట్ చేసి హింసిస్తారని తెలిపారు. అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. కాలేజీ యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

విద్యార్థులు లెక్చరర్లమీద దాడి చేశారని.. దీంతో వారు కూడా భయాందోళనలకు గురవుతున్నారని.. కాలేజీలోకి ఫోన్లు తీసుకురానివ్వమని.. ఈ నేపథ్యంలో వీడియోలు ఎలా వచ్చాయో కూడా తాము ఎంక్వైరీ చేస్తామని కాలేజీ యాజమాన్యం అంటోంది. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరగలేదని.. పిల్లలు చెబుతున్నట్లుగా ఏ సంఘటనా తమ దృష్టికి రాలేదని వారు అంటున్నారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నార్సింగిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలోని క్లాస్ రూంలో సాత్విక్ అనే విద్యార్థి బలవన్మరణానికి పూనుకున్నాడు. కాలేజీలో వేధింపుల వల్ల మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాత్విక్ ను కాలేజీలో కొట్టేవారని, దానితో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని అంటున్నారు.

మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకున్న సాత్విక్ ను ఆస్పత్రికి తరలించడానికి కూడా యాజమాన్యం ముందుకు రాలేదని, తామే బయట వరకు మోసుకుని వచ్చి బైకర్ ను లిఫ్ట్ అడిగి అస్పత్రికి తరలించామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించి మరో హాస్టల్ కు తరలిస్తున్నారు.

click me!