కిడ్నాపర్ అనే అనుమానంతో నిజామాబాద్‌లో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు వ్యక్తి అక్కడే చనిపోయాడు. నిజంగానే చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయా? ఈ గాలి వార్తలను నమ్మరాదని పోలీసులు సూచిస్తున్నారు.
Kidnappers: తెలంగాణలో గత వారం పది రోజుల్లో ఓ వార్త అందరినీ కలత పెడుతున్నది. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిందని, పిల్లలను ఎత్తుకెళ్లుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లలో ఎక్కువ ప్రచారం అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. హనుమకొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, కామారెడ్డితోపాటు మరికొన్ని జిల్లాల్లో ఈ ముఠాలు సంచరిస్తున్నాయని, తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త అంటూ ఓ సందేశం వైరల్ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు అప్రమత్తం అవుతున్నారు.
ఎవరు కొత్తగా కనిపించినా వారి గురించి ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే చుట్టూ చేరి ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం పని అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ అనుమానాల కారణంగానే నిజామాబాద్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. బర్ల రాజు అనే వ్యక్తి గాయత్రి నగర్‌లో కనిపించగా.. స్థానికులు అతడిని కిడ్నాపర్ అనే భావించి చితకబాదారు. రాజు స్పాట్‌లోనే చనిపోయాడు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని చంద్రబాబుకు అమిత్ షా షరతు? అందుకే పొత్తు ప్రకటనలో జాప్యం?
నిజంగానే ముఠాలు సంచరిస్తున్నాయా?
నిజామాబాద్‌లో ఇద్దరు చిన్నారులు ఇటీవలే కిడ్నాప్ కావడం కలకలం రేపగా.. పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నాయని, పోలీసులు దృష్టి సారిచాలని స్థానికులు కోరారు. అయితే.. ఆ ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అలాంటి గాలి వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని, భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు. పలు జిల్లాల ఎస్పీలు, కమీషనరేట్ల సీపీలు ఈ విషయమై స్పష్టత ఇస్తున్నారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా నగరంలోకి ప్రవేశించిందని ప్రచారాలను నమ్మవద్దని హన్మకొండ ఏసీపీ తెలిపారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నెంబర్‌కు డయల్ చేయాలని పోలీసులు తెలిపారు. పోలీసు కంట్రోల్ రూమ్ 8712685070కూ సమాచారం ఇవ్వాలని కోరారు.