
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే పలు వేల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైందని వార్తలు వచ్చాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఆయన దావోస్‌లో ఓ ప్రసంగం చేశారు. ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అంశంపై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తనను తాను పరిచయం చేసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడారు. తాను ఒక రైతు బిడ్డ అని చెప్పారు. తమ కల్చర్.. అగ్రికల్చర్ అని తెలిపారు. తమ దేశంలో వ్యవసాయం లాభసాటిగా లేదని అన్నారు. రైతులు ఎంతో శ్రమిస్తారని, కానీ, వారు పెట్టిన పెట్టుబడికి, పడిన కష్టానికి తగిన లాభాలు రావని వివరించారు. వారి ఆధునిక సాంకేతికతకు ఆమడ దూరంలో ఉన్నారని తెలిపారు. దావోస్‌లోని లీడర్లందరికీ తన విజ్ఞప్తి ఏమిటంటే.. ప్రపంచానికి సహాయం చేసే రైతులకు.. ప్రపంచం కూడా సహాయం చేయాలని కోరారు. రైతు ఆత్మహత్యల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ దేశంలోని వ్యవసాయ రంగంలో అతిపెద్ద సమస్య రైతుల ఆత్మహత్యలు అని వివరించారు.
Also Read: NTR: నారా లోకేశ్‌కు ఆర్జీవీ సూటి ప్రశ్న.. ‘ఎన్టీఆర్ హంతకుడిని..’
ఇతర రంగాల్లో, వ్యాపారల్లో పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చినట్టే వ్యవసాయంలోనూ రైతులకు పెట్టుబడులకు తగిన లాభాలు రావాలనేది తమ కల అని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని వివరించారు.