అద్దంకి దయాకర్ (Addanki dayakar)కు ఎమ్మెల్సీ (MLC) టిక్కెట్ నిరాకరించడం పట్ల ఆయన అభిమానులు, మాల మహానాడు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాల్సిందే అని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. చివరి నిమిషంలో ఆయన పేరు తప్పిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జాతీయ మాలమహానాడుకు చెందిన ఇద్దరు సభ్యులు మెదక్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టింది.
ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు రాందాస్ చౌరస్తా దగ్గర ఉన్న సెల్ టవర్ ఇక్కి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడి పని చేస్తున్న అద్దంకి దయాకర్ రావుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాల్సిందే అని వారు నినాదాలు చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మెదక్ జిల్లా,రాందాస్ చౌరస్తా వద్ద సెల్ టవర్ ఎక్కి ఇద్దరు మాల మహానాడు కార్యకర్తలు నిరసన తెలిపారు pic.twitter.com/sNWi96gzEn
— Telugu Scribe (@TeluguScribe)
అలాగే మాలమహానాడు తెలంగాణ విభాగం నాయకులు గురువారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అద్దంకి దయాకర్ ను పదే పదే అవమానిస్తే ఇక సహించేది లేదని నినాదాలు చేశారు. సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఆయనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి అద్దంకి దయాకర్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పార్టీ తరఫున పలు టీవీ చర్చల్లో కూా పాల్గొన్నారు. ఆయన తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ పార్టీ వివిధ కారణాలు, సమీకరణల నేపథ్యంలో మందుల శ్యామూల్ కు టిక్కెట్ కేటాయించింది. కానీ ఆయన పార్టీపై ఏ మాత్రమూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. శ్యామూల్ గెలుపు కోసం పని చేశారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ పార్టీ కోసం కష్టపడి పని చేశారని కొనియాడారు.
అయితే ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. బుధవారం ఆయనకు టిక్కెట్ ఖరారు అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ హఠాత్తుగా ఆయన పేరుకు బదులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే దీనిపై అద్దంకి దయాకర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ తనకు దీని కంటే మంచి బాధ్యతలు ఇవ్వాలని చూస్తుందేమో అని అన్నారు. పార్టీని నిందించడం సరైంది కాదని తెలిపారు.