సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించి కొన్ని సూచనలు చేసినట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారంనాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో భేటీ అయ్యారు. నెల 16 నుండి తాను ప్రారంభించే పాదయాత్రకు సహకరించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని భట్టి విక్రమార్క కోరారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాము అత్యంత దగ్గరనుండి చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.ఎండలు బాగా ఉన్న సమయంలో భట్టి విక్రమార్క పాదయాత్ర సాగనున్నందున్నారు. మంచిర్యాల, జడ్చర్ల, షాద్ నగర్ లలో సభలు పెట్టాలని తాను భట్టి విక్రమార్కకు సూచించినట్టుగా చెప్పారు. నకిరేకల్ , సూర్యాపేటలలో మినీ పబ్లిక్ మీటింగ్ లు పెట్టాలని కోరానన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున శని, ఆదివారాల్లో మాత్రమే పాదయాత్రలో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు తనను పిలవలేదన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
హాత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు.
also read:పాదయాత్రకు సహకరించాలి: కోమటిరెడ్డితో భట్టి భేటీ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన మేడారంలో పాదయాత్రను ప్రారంభించారు. ఇటీవలనే నిర్మల్ నుండి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. హైద్రాబాద్ వరకు మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర సాగనుంది. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాదయాత్రను నిర్వహించనున్నారు.. పాదయాత్ర నిర్వహిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రకటించారు. కానీ పాదయాత్ర గురించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా రూట్ మ్యాప్ ను ప్రకటించాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత పాదయాత్రపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుండి స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.