
Brs welcomes Amit Shah with 'Washing Powder Nirma: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాలను హీటెక్కించింది. ముఖ్యంగా ఆప్, బీఆర్ఎస్ నాయకులను వరుసగా దర్యాప్తు సంస్థలు విచారణకు పిలుస్తుండటంపై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఇదే సమయంలో బీజేపీ-బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవడం, ఆమెను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో బ్యానర్లు, పోస్టర్లు వెలుస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు టార్గెట్ గా వాటిల్లో విమర్శలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే బాగా ప్రాచుర్యం పొందిన వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ తో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాకు బీఆర్ఎస్ స్వాగతం పలికింది. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ తో అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న బ్యానర్లు, పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. సంబంధిత పోస్టర్లలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బీజేపీలో చేరిన తర్వాత వారిపై ఉన్న అన్ని దర్యాప్తులు, విచారణలు ఆగిపోయిన విషయాలను గుర్తు చేసే విధంగా పలువురు నాయకుల ఫొటోలు ఉన్నాయి.
వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లోకనిపించే అమ్మాయి ఫొటో ఫేసులో బీజేపీలోకి మారినవారితో పాటు వివిధ కేసుల ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుల ఫొటోలు ఉన్నాయి. పోస్ట్‌లో బీజేపీ నేత నారాయణ్ రాణే, సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మ, ఈశ్వరప్ప తదితరుల ముఖాలు ఉన్నాయి. బీజేపీ తీరును, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ అమిత్ షాపై విమర్శలు చేస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ సైతం శనివారం ట్విటర్‌లో బీజేపీ నాయకులు, ఎదుర్కొన్న స్కామ్ లను ప్రస్తావిస్తూ వారికి క్టీన్ చిట్ ఇచ్చిన తీరుపై విమర్శలు గుప్పించింది.
అంతకుముందు, బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలిశాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య విధ్వంసకుడు, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హిపోక్రసీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ గోడలపై దర్శనమిచ్చిన పోస్టర్లలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఉన్నారు.