నెల రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్:నెలరోజుల్లో పార్టీని ప్రకటిస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రకటించారు. కళాకారులు, జర్నలిస్టులు సమక్షంలో పార్టీని ప్రకటిస్తానని గద్దర్ ప్రకటించారు. సోమవారంనాడు గద్దర్ సరూర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో గద్దర్ పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ ఆడి పాడారు.. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తే తాను అక్కడి నుండి పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీగా ఆయన పేర్కొన్నారు. 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్దర్ తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గద్దర్ ప్రచారం నిర్వహించారు.
అయితే ఈ ఎన్నికల సమయంలో గద్దర్ తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. తనకు భద్రతను పెంచాలని గద్దర్ పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు.
మావోయిస్టు పార్టీ తో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన గద్దర్ జనజీవన స్రవంతిలో కలిశారు. 2018 ఎన్నికల సమయంలోనే గద్దర్ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అదే సమయంలో తొలిసారిగా ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు.