
నల్గొండ : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ పదవిని రాజ్యాంగబద్దంగానే నిర్వహిస్తున్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ చట్టాలను అనుసరిస్తూ న్యాయ బద్దంగానే చైర్మన్, స్పీకర్ స్థానాలకు న్యాయం చేస్తున్నామని అన్నారు. తనతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. సంజయ్ తీరు గురివింద గింజ సామెతను గుర్తుచేస్తుందని అన్నారు.
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డి లపై మండిపడ్డారు. అసలు తనగురించి మాట్లాడేహక్కు సంజయ్ కు లేదన్నారు. తాము రాజ్యాంగబద్దంగా వ్యవహరించడం లేదంటున్న సంజయ్ గవర్నర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ విధులు నిర్వర్తించాల్సిన తమిళిసై సౌందరరాజన్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నారా? ఇంకా అనేక రాష్ట్రాల గవర్నర్లు ఎలా బిజెపికి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారు... దీని గురించి ఎందుకు మాట్లాడవు అంటూ సంజయ్ ను నిలదీసారు గుత్తా.
ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు మరోలా వుందని... ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలు కంటున్నాడని మండలి ఛైర్మన్ పేర్కొన్నారు. కేవలం తెలంగాణను దోచుకోడానికే సీఎం కావాలనుకుంటున్న రేవంత్ ను ప్రజలు నమ్మరని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి అస్సలు లేదన్నారు. కేసీఆర్ పైనా, ఆయన సంక్షేమ పాలనపైనా ప్రజలకు విశ్వాసం వుందన్నారు.
Read More ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు:: బెల్లంపల్లిలో రేవంత్ పై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకం చేయడానికి తప్ప రాహుల్, ప్రియాంక గాంధీల పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ వుండదని గుత్తా అన్నారు. తక్కెడలో కప్పల మాదిరిగా కాంగ్రెస్ పరిస్థితి వుందంటూ ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి అస్సలు లేదన్నారు. పరాయి పాలనను సహించలేక స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని... అలాంటిది మళ్లీ డిల్లీ నుండి పాలన సాగించే పార్టీలను ప్రజలు నమ్మబోరని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని...రాష్ట్రం కూడా వేగంగా అభివృద్ది చెందుతుందని అన్నారు.
కేవలం ఎన్నికల్లో గెలుపుకోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ మతపరమైన నినాదాలు చేయడం దారుణమని గుత్తా అన్నారు. రాజ్యాంగబద్ద పదవిలో వున్న వ్యక్తి ఇలా చేయడం తగదన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడకుండా నిత్యం ప్రజల నడుమ విద్వేషాలు పెంచుతూ రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ పార్టీ నేతలు చూస్తున్నారని అన్నారు. ప్రధాని తన స్థాయిని మరిచి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక శక్తులు విజయం సాదించాలని కోరుకుంటున్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.