
Air India : తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తున్న ఓ ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆకాశంలో ప్రయాణిస్తుండగా విమానం రెక్కలను పక్షులు ఢీకొన్నాయి... ఓ పక్షి అందులోనే ఇరుక్కుపోయింది. అయితే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు చాకచక్యంగా వ్యవహరించిన విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 100 మంది ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు ఎయిరిండియా విమానం బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది... అది విమానం రెక్కలో చిక్కుకుపోయింది. దీంతో పైలట్స్ వెంటనే అప్రమత్తం అయ్యారు.. ఎలాంటి ప్రమాదం జరక్కముందే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. తమకు ఎదురైన పరిస్థితి గురించి గ్రౌండ్ సిబ్బందికి వివరించి తిరిగి వైజాగ్ కే విమానాన్ని మళ్లించారు. ఇలా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తిరిగి వైజాగ్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.
అయితే ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ కు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కానీ ప్రమాదం నుండి తప్పించుకున్నవారు కాస్త ఆలస్యంగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇలా దాదాపు 100 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.