సగం మంది బాలికలకు STEM అంటే ఏంటో తెలియదు: CRY అధ్యయనం

Published : Sep 12, 2025, 11:41 PM IST
Child Rights and You

సారాంశం

Child Rights and You: 52% బాలికలకు STEM అంటే ఏమిటో తెలియదు. అయినప్పటికీ బాలికల్లో సైన్స్ విద్య, కెరీర్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉందని చైల్డ్ రైట్స్ అండ్ యూ (CRY) అధ్యయనం వెల్లడించింది.

Child Rights and You: బాలికల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమాటిక్స్) అధ్యయనాల గురించి బాలబాలికలకు తగినంతగా అవగాహన లేదని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ CRY - చైల్డ్ రైట్స్ అండ్ యూ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈ నివేదిక ప్రకారం, దక్షిణ భారతదేశంలో 52% బాలికలు, 51% బాలురు STEM గురించి ఎప్పుడూ వినలేదు. అయినప్పటికీ 54% బాలికలు సైన్స్ సబ్జెక్టులను ఎంచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాలురలో సైన్స్ సబ్జెక్టులు ఎంచుకోవాలని కోరుకుంటున్నవారు 43% ఉన్నారు.

కిశోర బాలబాలికల్లో 52% బాలికలకు, 51% బాలురకు STEM గురించి తెలియదు. ఈ అక్షరాలు ఏమిటో తెలిసిన వారు కేవలం మూడో వంతు మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా వారు STEM రంగాల్లోకి వెళ్లగలిగే అవకాశాలు పరిమితమవుతున్నాయి : Child Rights and You స్టడీ

రాబోయే అంతర్జాతీయ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11, 2025) సందర్భంగా CRY ఈ అధ్యయనం విడుదల చేసింది. ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు, లింగ ఆధారిత ఆంక్షలు వంటి వ్యవస్థాగత అవరోధాల కారణంగా బాలికలు STEM రంగాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారనే నిజాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది.

దక్షిణ భారతదేశంలోని CRY పని చేస్తున్న ప్రాంతాలలో 9 నుండి 12వ తరగతి విద్యార్థులైన 942 మంది కిశోరబాలబాలికల (471 బాలికలు, 471 బాలురు)తో నిర్వహించిన ఈ సర్వే, STEM విద్య పట్ల బాలికల్లో ఉన్న ఆకాంక్షలను, వారు ఎదుర్కొంటున్న అడ్డంకులను రెండింటినీ బయటపెడుతోంది.

సైన్స్, టెక్నాలజీ విద్యలో లింగ అసమానతలను రూపుమాపడానికి చేపట్టే కార్యక్రమాలకు, సామాజిక కార్యకర్తలు, అధికార యంత్రాంగం, సమాజం అందరూ భాగస్వాములుగా చేసే కృషికి అవసరమైన సమాచారాన్ని అందించడం లక్ష్యంగా CRY ఈ అధ్యయనం చేసింది.

CRY అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు

అవగాహన తక్కువ: కిశోర బాలబాలికల్లో 52% బాలికలకు, 51% బాలురకు STEM గురించి తెలియదు. ఈ అక్షరాలు ఏమిటో తెలిసిన వారు కేవలం మూడో వంతు మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా వారు STEM రంగాల్లోకి వెళ్లగలిగే అవకాశాలు పరిమితమవుతున్నాయి.

ఆసక్తి ఎక్కువ: 10 లేదా 12వ తరగతి తర్వాత 54% బాలికలు సైన్స్ స్ట్రీమ్‌ ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది బాలురలో 43% గా మాత్రమే ఉంది. అంటే బాలురతో పోలిస్తే బాలికల్లో సైన్స్ స్ట్రీమ్ పట్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే, 51% బాలికలు STEM కెరీర్‌లు (ఉదా., డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఐటీ ప్రొఫెషనల్) ఎంచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాలురలో ఇలాంటి కెరీర్ ఆకాంక్ష 45% గా ఉంది. అంటే బాలురలో కన్నా బాలికల్లో ఎక్కువగా STEM ఆకాంక్షలు ఉన్నాయి. బాలికల్లో అంతర్గతంగా ఉన్న ఈ ప్రేరణకు సరైన అవగాహన, సదుపాయాలు, ఆర్థిక మద్దతు లభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తోంది.

వనరుల లేమి: కేవలం 20% బాలికలకు, 18% బాలురకు మాత్రమే సైన్స్ ల్యాబ్‌లు క్రమంతప్పకుండా అందుబాటులో ఉన్నాయి. అలాగే, 13% బాలికలకు, 12% బాలురకు మాత్రమే తరగతుల అనంతరం సైన్స్, మ్యాథ్స్ ట్యూషన్ లేదా కోచింగ్ లభిస్తోంది. కెరీర్ కౌన్సెలింగ్ కేవలం 35% బాలికలు, 32% బాలురకు మాత్రమే అందుతోంది. ఇది బాలబాలికలకు భవిష్యత్ విద్య, కెరీర్ గురించిన మార్గదర్శనం అవసరాలను సూచిస్తోంది.

బాలికలకు ఆదిలోనే అవరోధాలు

ఆర్థిక అడ్డంకులు: బాలికల్లో 25% మంది సైన్స్ లేదా మ్యాథమాటిక్స్ ఎంచుకోవడానికి ప్రధాన అడ్డంకిగా ఆర్థిక సమస్యలను తెలిపారు. ఆ తర్వాత పెద్ద అవరోధం కుటుంబం నుంచి మద్దతు లేకపోవడమని 15% మంది బాలికలు చెప్పారు. సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడం (11%), స్కూళ్లలో సైన్స్ స్ట్రీమ్‌లు అందుబాటులో లేకపోవడం (8%) ఇతర అడ్డంకులలో ఉన్నాయి.

కుటుంబ అడ్డంకులు (19%): కుటుంబంలో సంప్రదాయ కట్టుబాట్లు, బాలికలకు త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచనలు, వారి భద్రతకు సంబంధించిన ఆందోళనలు.. బాలికలను STEM కెరీర్‌ల విషయంలో తల్లిదండ్రులు నిరుత్సాహపరచడానికి కారణమవుతున్నాయి.

సామాజిక అడ్డంకులు (17%): STEM రంగాల పట్ల బాలికల్లో ఆకాంక్షలు ఉన్నప్పటికీ.. అవి “పురుషుల” రంగాలుగా భావించే మూసధోరణులు బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఉపాధ్యాయ అడ్డంకులు (13%): కొంతమంది ఉపాధ్యాయులు STEM సబ్జెక్టులను “చాలా కష్టం” అంటూ.. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులను అసమర్థత సూచికలుగా పేర్కొంటూ బాలికలను నిరుత్సాహపరుస్తున్నారు.

ఇతర అడ్డంకులు: ఆర్థిక ఇబ్బందులు (11%), భయం లేదా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం (8%) కూడా బాలికలు STEM సబ్జెక్టులను ఎంచుకోకుండా అడ్డుకుంటున్నాయి.

ప్రోత్సాహం అవసరం: కుటుంబం నుండి, ఉపాధ్యాయుల నుండి, సమాజం నుండి ప్రోత్సాహం చాలా అవసరమని CRY అధ్యయనంలో 38% మంది బాలికలు బలంగా చెప్పారు. STEM రంగంలో పనిచేస్తున్న ఒక మహిళా రోల్ మోడల్ గురించి (కుటుంబంలో అక్క గానీ, చుట్టుపక్క సమాజంలో ఇంకెవరైనా కానీ) తెలిసిన కిశోర బాలికలు ఈ కెరీర్‌ లోకి తాము కూడా వెళ్లాలని ఆకాంక్షించే అవకాశం గణనీయంగా ఎక్కువ (53%)గా ఉంది. అలాంటి రోల్ మోడల్స్ లేకపోయినట్లయితే ఈ ఆకాంక్ష 46% గానే ఉంది. ఇది, స్వయంగా చూడడం ద్వారా లభించే ప్రేరణ శక్తిని చాటిచెప్తోంది.

కార్యాచరణను సూచించే అంశాలు...

• బాలికలను STEM ఆకాంక్షలను మరింతగా ప్రోత్సహించడానికి అవసరమైన కార్యాచరణ ఎలా ఉండవచ్చో కూడా ఈ అధ్యయనం సూచిస్తోంది.

• సైన్స్ స్ట్రీమ్‌ను ఎంచుకునే అవకాశం STEM గురించి తెలిసిన విద్యార్థుల్లో 64% గా ఉంటే.. తెలియని వారిలో 42% గా మాత్రమే ఉంది.

• సైన్స్ ఎంచుకునే అవకాశాలు సైన్స్ ల్యాబ్ అందుబాటులో ఉన్నవారిలో 69%గా ఉంటే.. అవి అందుబాటులో లేని వారిలో కేవలం 36% గానే ఉంది.

• కెరీర్ కౌన్సెలింగ్ వల్ల STEM ఆకాంక్షలు 8% ఎక్కువగా ఉంది. ఈ కౌన్సెలింగ్ లభించిన వారిలో 55% మంది STEM కెరీర్‌లను లక్ష్యంగా చేసుకుంటే, లభించని వారిలో 46% మాత్రమే ఉన్నారు.

అంటే.. కిశోర బాలికలు STEM వైపు అడుగులు వేయడానికి.. అవగాహన, స్వీయ అనుభవం, రోల్ మోడల్స్ అనేవి చాలా కీలక ప్రభావాలుగా స్పష్టమవుతోంది.

సాధికారతకు మార్గం

“బాలుర కంటే బాలికల్లో ఆకాంక్షలు ఏమాత్రం తక్కువగా ఉండవని, నిజానికి STEM పట్ల వారిలో ఉత్సాహం ఎక్కువగానే ఉంటుందని CRY నిర్వహించిన ‘STEM లో బాలికలు’ అధ్యయనం ధృవీకరిస్తోంది. అయినప్పటికీ.. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవరోధాల వల్ల వారి ఆకాంక్షలను సాకారం చేసుకోలేకపోతున్నారు” అని CRY – సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ తెలిపారు.

‘‘ఈ అధ్యయనంలో పాల్గొన్న బాలికలు, STEM విద్యకు - సాధికారతకు, ఆర్థిక పురోగతికి సంబంధం ఉందని స్పందించారు. “మంచి ఉద్యోగం సాధించడానికి”, “స్వతంత్రంగా ఉండటానికి” STEM విద్య ఒక మార్గంగా అభివర్ణించారు’’ అని ఆయన వివరించారు.

సెప్టెంబర్ 14న CRY అవగాహన వాక్

“ఈ అడ్డంకులు నిజమైనవే.. కానీ పరిష్కరించగలిగినవి. స్కాలర్‌షిప్‌లు, మెంటార్‌షిప్ కార్యక్రమాలు, సామాజిక అవగాహనా కార్యక్రమాలు వంటి చర్యలతో మనం ఈ అంతరాలను తగ్గించి, బాలికలు STEMలో పురోగమించేలా సాధికారం చేయవచ్చు. ఇది భారతదేశ శ్రామికశక్తిలో లింగ అసమానతలను తగ్గించడానికి, దేశ శాస్త్రసాంకేతిక, ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుంది” అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.

ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఆధారంగా చేసుకొని.. కార్యాచరణను ప్రేరేపించడానికి, CRY ఈ రోల (సెప్టెంబర్) 14వ తేదీన బెంగళూరులో “STEM లో బాలికలు – తరతరాల సాధికారం” థీమ్‌తో ‘వాక్ టు ఎంపవర్‌హెర్‌’ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు, రోల్ మోడల్స్.. ఒక వేదిక మీదకు వచ్చి.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమాటిక్స్ విద్య సమానంగా అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని చాటి చెప్తుందని వివరించారు.

CRY వాక్ బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో ఉన్న బాల్ భవన్ వద్ద 2025 సెప్టెంబర్ 14, ఆదివారం ఉదయం 8:00 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతునిస్తూ పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. వారిలో పూజా మార్వాహ, CEO, CRY, డాక్టర్ నాగలక్ష్మి చౌదరి, చైర్‌పర్సన్, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్,  డాక్టర్ బసవరాజ్ బి. ధబడి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ చైల్డ్ హెల్త్, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ విభాగం,  డాక్టర్ తారా అనురాధ, నటి, సామాజిక కార్యకర్త, లతా నాయక్, డైరెక్టర్, ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్. ప్రభావతి, చిగురు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు,  CRY ప్రాజెక్టుల నుండి చిన్నారులు, స్ఫూర్తిదాయక బాలికలు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu