
Swachh Survekshan Grameen’ rankings: 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' ర్యాంకింగ్స్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంగా సుజలం క్యాంపెయిన్, జాతీయ చలనచిత్ర పోటీలు, వాల్ పెయింటింగ్ సహా పలు పోటీలలో అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత వివరాలను వెల్లడిస్తూ.. ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్.. ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు తెలుపుతూ.. ఇందులో భాగమైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' ర్యాంకింగ్స్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 'స్వచ్ఛ్ భారత్ మిషన్' దివస్ 2022 కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 13 అవార్డులను అందజేసింది. ఎస్‌ఎస్‌జీ సౌత్ జోన్ ర్యాంకింగ్స్‌లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (SSG) ర్యాంకింగ్స్‌తో పాటు, రాష్ట్రం, దాని వివిధ జిల్లాలు వివిధ విభాగాలలో ఉన్నత ర్యాంక్‌ల ద్వారా మరో పది విభిన్న అవార్డులను గెలుచుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంగా సుజలం క్యాంపెయిన్, జాతీయ చలనచిత్ర పోటీలు, వాల్ పెయింటింగ్ సహా పలు పోటీలలో ఇతర అవార్డులను గెలుచుకుంది.
రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ లో ఈ విజయాల జాబితాను పోస్ట్ చేశారు.తెలంగాణ కీర్తి కిరీటంలో మరిన్ని విజయాలు అంటూ పోస్ట్ చేసిన ఆయన.. SBM కార్యక్రమం కింద భారతదేశం అంతటా నెం.1 రాష్ట్రం సహా 13 అవార్డులను తెలంగాణ పొందినందుకు గర్వంగా ఉంది. జీపీలు, డిపార్ట్ మెంట్ లకు నిరంతరం మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్‌ఎస్‌జీ) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. అలాగే, మంత్రి దయాకర్‌రావుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక “పల్లె ప్రగతి” కార్యక్రమానికి ఈ గుర్తింపు లభించిందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శించవచ్చు కానీ మా ప్రభుత్వ పనితీరు ప్రశంసలు, హృదయాలను గెలుచుకుంటుంది అని కేటీఆర్ అన్నారు.