
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పెద్దపెద్ద భవనాల నిర్మాణాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నగరంలో ప్రస్తుతం 50 అంతస్తులకుపైగా ఉన్న స్కైస్క్రేపర్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు, రాబోయే రోజుల్లో 100 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్ కూడా హైదరాబాద్ నగర ఆకృతిని మరింతగా పుంతలు తొక్కించనుంది. హైదరాబాద్ నగర పరిధిలో రియల్ బూమ్ ను మరింత పెంచనుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లిపురం రాజశేఖర్ రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో 100 అంతస్తుల టవర్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కొల్లూర్ ప్రాంతంలో ఇప్పటికే 70 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది.
ఈ ఇంటర్వ్యూలో రాజశేఖర్ రెడ్డి, స్కైస్క్రేపర్ల నిర్మాణ పద్ధతులపై, చిన్న అపార్ట్‌మెంట్‌ల ప్రాజెక్టులపై విస్తృతంగా వివరించారు. అలాగే ఈ రంగంలోకి అడుగుపెట్టదలచిన పెట్టుబడిదారులకు, ఫ్లాట్ కొనుగోలుదారులకు ముఖ్యమైన పలు సూచనలు కూడా చేశారు.
హైదరాబాద్ నగరంలో గణనీయమైన భూముల లభ్యత, హై రైజ్ నివాసాలకు పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి వంటి అంశాలు నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. నగరం అన్ని దిశలలోనూ పెద్ద పెద్ద అంతస్తుల నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్ 50 అంతస్తులకుపైగా ఉండే భవనాలతో రూపుదిద్దుకుంటున్నాయి.
ఇదే విషయంపై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “సస్టైనబుల్ కట్టడాలు, ఆధునిక వసతులు ఇప్పుడు హైఎండ్ ప్రాజెక్టుల్లో సాధారణం అవుతున్నాయి. ఇవి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి” అని వివరించారు.
హైదరాబాద్ నగరం భవిష్యత్తులో మరింత ప్రగతితో రియల్ ఎస్టేట్ లో దూసుకెళ్తుందని రిపోర్టులు కూడా పేర్కొంటున్నాయి. మరింత పెద్ద భవనాలతో పైకి ఎదుగుతుంది అన్నదానికి ఈ 100 అంతస్తుల టవర్ ప్రాజెక్ట్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఈ ప్రాజెక్టును విజయవంతం చేయనున్నాయి.