
హైదరాబాద్‌లోని కొన్ని ప్రసిద్ధ రెస్టారెంట్లు కస్టమర్లకు ఉచితంగా తాగునీరు ఇవ్వకుండా, బాటిల్ వాటర్ కొనాలని చెప్పేస్తున్నాయి. దీనిపై చాలా మంది నగరవాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లలో వేటర్లు నేరుగా ఉచిత నీళ్లు ఉండవని, బాటిల్ నీరు కొనాలంటూ చెబుతున్నారు. బాటిల్ ఒక్కటి రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కాజగూడలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తి తన అనుభవాన్ని Redditలో పంచుకున్నాడు. ఆయన తన మిత్రుడితో కలిసి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఉచిత నీరు అడిగితే, “ఇక్కడ ఉచిత నీరు ఇవ్వము” అంటూ వేటర్ బాటిల్ కొనాలని చెప్పాడట.
2023లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ఓ కేసులో, ఉచిత తాగునీరు నిరాకరించిన ఓ రెస్టారెంట్‌ను కస్టమర్‌కు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కూడా అన్ని రెస్టారెంట్లు ఉచిత తాగునీరు అందించాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చట్టం ప్రకారం అన్ని రెస్టారెంట్లు ఉచితంగా తాగునీరు అందించాలి. అది రెస్టారెంట్ యాజమాన్యం కనీసం బాధ్యత. ఒకవేళ ఉచితంగా మంచి నీరు ఇవ్వడానికి నిరాకరిస్తే కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే బాటిల్ నీటికి MRP కంటే ఎక్కువ వసూలు చేయరాదు.