హైదరాబాద్‌లో గడిచిన సెప్టెంబర్ నెలలో ఏకంగా 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో నమోదైన ఆస్తుల విలువ రూ.3,378 కోట్లు. మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికంగా 45 శాతం గృహ విక్రయాలు జరిగాయి.
రిస్క్ తక్కువగా వుండే వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. అందుకే అన్ని వర్గాల చూపూ దానిపైనే వుంటుంది. పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాలు ఇలా ఎవరికైనా సొంతింటి కల అనేది ఖచ్చితంగా వుంటుంది. ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు ఇంటిని నిర్మించుకుంటూ వుంటారు. దేశంలో ఆదాయాలు బాగా పెరగడంతో అన్ని సౌకర్యాలు వుండే ఇళ్లను జనం ఇష్టపడుతున్నారు. అలాగే భవిష్యత్ కోసం కొందరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఈ సెక్టార్ రోజు రోజుకు వృద్ధి చెందుతోంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో గడిచిన సెప్టెంబర్ నెలలో ఏకంగా 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2022లో ఇదే సమయంలో పోలీస్తే ఇది 30 శాతం అధికమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అంతేకాదు.. గత నెలలో నమోదైన ఆస్తుల విలువ రూ.3,378 కోట్లు. రూ.25 నుంచి 50 లక్షల మధ్యనున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఆ తర్వాత 25 లక్షల రూపాయలతో వున్న ఆస్తులు నిలిచాయి.
అలాగే 1000 నుంచి 2000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై వున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ 71 శాతం మేర జరిగాయి. 500 నుంచి 1000 మధ్య రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తులు.. 2022లో 16 శాతం వుంటే, ఇప్పుడు అది 14 శాతానికి పడిపోయాయి. 2000కు పైన వుండే ఆస్తులకు డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇవి 2022 లో 9 శాతం వుంటే.. 2023లో 11 శాతానికి చేరాయి. హైదరాబాద్ విస్తరించిన పరిధిలో.. మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికంగా 45 శాతం గృహ విక్రయాలు జరిగాయి.
ఆ తర్వాత 41 శాతం వాటాతో రంగారెడ్డి, 14 శాతం వాటాతో హైదరాబాద్ నిలిచాయి. హైదరాబాద్ జిల్లాలో ఆస్తుల విలువ బాగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. ప్రజలు డబుల్ బెడ్ రూమ్ యూనిట్‌ల నుంచి ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ల వైపు మళ్లుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే హైదరాబాద్‌లోని ప్రాపర్టీ డెవలపర్‌లు ట్రిపుల్ బెడ్‌రూమ్ యూనిట్‌లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.