రాహుల్‌కు నేటికీ ఇల్లు లేదు.. కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాలు, వేలు కోట్లు : రేవంత్ రెడ్డి

By Siva Kodati  |  First Published Oct 19, 2023, 5:22 PM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ వుండేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు . ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని .. కేసీఆర్, కేటీఆర్‌కు వందల ఎకరాలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన నిలదీశారు. 


కులాలు, మతాల పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూసిందన్నారు ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గురువారం పెద్దపల్లిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ప్రజలకు అండగా నిలిచారని ప్రశంసించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని.. నీళ్లు, నిధులు , నియామకాలు పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు జీరాక్స్ సెంటర్లలో విక్రయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోసారి మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్ట్‌లు నిర్మించింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు ఐటీ ప్రాజెక్ట్‌లు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది ఎవరు అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకెళ్లారని .. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని ఆయన గుర్తుచేశారు. దేశం క్లిష్ట పరిస్ధితుల్లో వున్నప్పుడు మేధావులను సోనియా గాంధీ ప్రధానులుగా చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాని పదవులు చేపట్టకుండా పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లను ప్రధానులుగా చేశారని కొనియాడారు. 

Latest Videos

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది: మంథనిలో రాహుల్ గాంధీ

ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ వుండేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌కు వందల ఎకరాలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన నిలదీశారు. 

click me!