
Telangana: రాష్ట్రంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాసా), ప్రతిపక్ష బీజేపీల మధ్య వైరం మరింతగా ముదురుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. పోటాపోటీ ర్యాలీలు, నిరసనలకు దిగుతుండటంతో ఇప్పటికే పలు చోట్ల హింసాత్మక వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ (Telangana) ఏర్పాటుపై ప్రధాని మోడీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నాంపల్లిలోని గన్‌పార్క్ (Gun Park) వద్ద పలువురు నిరసనకు దిగారు. ప్రధాని మోడీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా గొంతెత్తారు. అక్కడి నుంచి బీజేపీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, ఈ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ (Telangana) ఏర్పాటుపై ప్రధాని (పీఎం) నరేంద్ర మోడీ (Narendra Modi) ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నాంపల్లిలోని గన్ పార్క్ కొనసాగిన నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గజ్జెల కంఠం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పి.రవి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్‌తో పాటు పలువురు వ్యక్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.
నిరసనలు కొనసాగుతున్న తరుణంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బీజేపీ (BJP) కార్యాలయం వద్దకు వెళ్లాలనే నిరసనకారుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే, సాయంత్రానికి వారిని వదిలిపెట్టారు. అయితే, గన్‌పార్క్ వద్ద నిరసనల నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) ప్రజల, ఉద్యమాన్ని మోడీ అగౌరవించారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోడీ ఎమన్నారంటే..
ఫిబ్రవరి 8న రాజ్యసభలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ (Narendra Modi).. “కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే కాంగ్రెస్ హడావిడిగా రాష్ట్రాన్ని విభజించింది” అని అన్నారు. అలాగే, "మైక్‌లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. స్ప్రే ఉపయోగించబడ్డాయి. విభజన బిల్లు ఆమోదం సమయంలో ఎటువంటి చర్చ జరగలేదు," అన్నారాయన. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే, ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్-TRS), కాంగ్రెస్ రెండూ రాష్ట్ర ప్రజలను, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన 1,200 మంది అమరవీరులను ప్రధాని అవమానించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనీ, క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ తీసిన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.