మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ ప్రిన్సిపల్ కోర్టుకు బదిలీ అయింది. కడప నుండి ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు ఇవాళ హైద్రాబాద్ కోర్టుకు తీసుకు వచ్చారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు కు బదిలీ అయింది. ఈ కేసు విచారణను కడప నుండి హైద్రాబాద్ కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కడప నుండి అధికారులు హైద్రాబాద్ కు మంగళవారం నాడు తరలించారు.
2019 మార్చి 19వ తేదీ రాత్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డిలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. మరో వైపు ఈ కేసును ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో విచారణ చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ చేసింది. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
also read:వివేకా హత్య కేసులో నిజానిజాలు త్వరగా తేల్చాలన్న షర్మిల.. ఆ ప్రశ్నకు మాత్రం ఉండకూడదు అని కామెంట్..
సుప్రీంకోర్టుఆదేశాల మేరకు హైద్రాబాద్ లోని ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు ఈ కేసును విచారించనుంది. కడప నుండి మూడు బాక్సుల్లో ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, చార్జీషీట్లు, వాంగ్మూలాలను అధికారులు హైద్రాబాద్ కోర్టుకు అందించారు.
ఈ కేసులో ఇప్పటికే దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి సునీల్ యాదవ్ లను అరెస్ట్ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ అధికారులు నిన్న నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేనని సీబీఐకి అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. నాలుగైదు రోజుల తర్వాత విచారణకు పిలిస్తే వస్తానని పేర్కొన్నారు.