తెలంగాణలో జనసేన రాజకీయం పరిమితంగానే.. కానీ 10 మంది ఎమ్మెల్యేలు కావాలి : పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 24, 2023, 4:43 PM IST
Highlights

కొండగట్టు పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ సమస్యలు వేర్వేరు అన్న ఆయన రెండింటిని పోల్చి చూడలేమన్నారు. తెలంగాణ అసెంబ్లీలో పది మంది జనసేన ఎమ్మెల్యేలు వుండాలన్నది తన కోరిక అని పవన్ పేర్కొన్నారు. 
 

తెలంగాణలో జనసేన రాజకీయం పరిమితమేనన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తనకు పునర్జన్మను ఇచ్చిన నేల అన్నారు. ఇక్కడ తన పాత్ర పరిమితమేనన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ నేలపైనే మొదలుపెట్టానని, తాను తెలంగాణలో పుట్టుంటే బాగుండేదని జనసేనాని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాట స్పూర్తే తన బలమని పవన్ పేర్కొన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. 

నీకు రాజకీయాలు ఎందుకని తనను అప్పట్లో కొందరు ప్రశ్నించారని పవన్ గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ వంటి వారిని యువత స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ కారణాలతోనే వారాహికి ఏపీలో అనుమతులు ఇవ్వలేదని జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఎప్పుడూ బీజేపీతోనే తనకు దోస్తి అన్న ఆయన.. తెలంగాణ అసెంబ్లీలో కనీసం పది మంది ఎమ్మెల్యేలు వుండాలని ఆకాంక్షించారు. 

ALso REad: కొత్త పొత్తులు కుదిరితే కలుస్తాం, 2014 కాంబినేషన్ కాలమే నిర్ణయిస్తుంది : పవన్ కళ్యాణ్

ఏపీ, తెలంగాణ సమస్యలు వేర్వేరు అన్న ఆయన రెండింటిని పోల్చి చూడలేమన్నారు. తెలంగాణలో 7 నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని.. రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో భావోద్వేగ రాజకీయం వుంటే.. ఏపీలో కుల రాజకీయం నడుస్తోందని, ఆంధ్రాలో రాజకీయాలు చేయడం కష్టమన్నారు. ఎవరైనా పొత్తు కోసం వస్తే ఆలోచిస్తానన్న ఆయన.. తెలంగాణప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో తాను లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీలో పది మంది జనసేన ఎమ్మెల్యేలు వుండాలన్నది తన కోరిక అన్నారు. 


 

click me!