తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగదు, మద్యం, మాదక ద్రవ్యాలతో పాటు ఇతర ప్రలోభాలకు గురిచేసే అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున పోలీస్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. తమ తమ కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే విధంగా ప్రత్యేక సెల్‌లను యాక్టివేట్ చేయాలని సీవీ ఆనంద్.. ఏసీపీలు, డీసీపీలను ఆదేశించారు.
నగదు, మద్యం, మాదక ద్రవ్యాలతో పాటు ఇతర ప్రలోభాలకు గురిచేసే అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమీషనర్ సూచించారు. ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకే మార్గంలో తారస పడకుండా చూసుకోవాలని.. దీనికి అనుగుణంగా రూట్ ప్లానింగ్, టైమింగ్, పర్మిషన్లు జారీ చేయటం వంటి వాటిలో అప్రమత్తంగా వుండాలని సీవీ ఆనంద్ ఆదేశించారు. లైసెన్స్ పొందిన తుపాకులను ప్రభుత్వానికి సరెండర్ చేసేలా చర్యలు తీసుకోవాలని.. ఎన్నికలు ముగిసే వరకు కొత్త లైసెన్స్‌లు జారీ చేయకూడదని కమీషనర్ వెల్లడించారు.
స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని సీపీ సూచించారు. సోషల్ మీడియాను పర్యవేక్షించడం, హవాలా ఆపరేటర్లపై నిఘా, సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సీవీ ఆనంద్ ఆదేశించారు. నగదు, విలువైన లోహాలను స్వాధీనం చేసుకునేటప్పుడు విధానాలను పాటించాలని ఆయన సూచించారు. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీస్ ప్రొవైడర్లపై నిఘా వుంచడం వంటి చర్యలు తీసుకోవాలని సీవీ ఆనంద్ ఆదేశించారు.