కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లో సుస్థిర ప్ర‌గ‌తి.. హుస్నాబాద్ వేదిక‌ను ప‌రిశీలించిన మంత్రి హ‌రీశ్ రావు

By Mahesh Rajamoni  |  First Published Oct 11, 2023, 4:44 PM IST

Karimnagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎన్నిక‌ల ప్రచారం ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలోనే హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నుంచి బీఆర్ఎస్ అధినేత రంగంలోకి దిగ‌నున్నారు. బ‌హిరంగ స‌భ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్లను, వేదిక‌ స్థలాన్ని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులు ప‌రిశీలించారు. 
 


Telangana Assembly Elections 2023: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హుస్నాబాద్ నుంచి మరోసారి ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ చేయ‌నున్నారు. 2018లో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి తన లక్కీ నియోజకవర్గంగా చెప్పుకున్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఈ సారి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈసారి అక్టోబర్ 15, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లక్ష మంది హాజరయ్యే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ లు బహిరంగ సభ మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందనీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Latest Videos

undefined

కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందనీ, ఇదే స్ఫూర్తితో ప్రజలందరి ఆశీస్సులు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు అబద్ధపు హామీలు ఇవ్వడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజలందరూ గమనించాలని కోరారు. కాంగ్రెస్ తప్పుడు మాటలు నమ్మ‌వ‌ద్దన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన‌, నియోజకవర్గంలో చిరకాలంగా కోరుకున్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని హరీశ్ రావు అన్నారు. సతీష్ కుమార్ ను మ‌రోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ నెల 15న ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు ఇచ్చి, బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారనీ, తొలి ఎన్నికల సభలో హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారని హరీశ్ రావు తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మరోసారి హుస్నాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష మంది హాజరయ్యే బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామనీ, ప్ర‌తిఒక్క బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సభను విజయవంతం చేయాలని కోరారు.

click me!