Telangana police: భద్రతా కారణాల నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు ఎగరవేయడంపై నగర పోలీసులు నిషేధం విధించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర రాజధానిలో మరింత నిఘా పెంచారు.
Telangana police: హైదరాబాద్ భద్రతా పరిస్థితుల నేపథ్యంలో నగరంలో డ్రోన్లు, పారా-గ్లైడర్లు, మైక్రో లైట్ విమానాలను ఎగరవేయకుండా నగర పోలీస్ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల భద్రత కోసం ఈ ఆదేశాలు తీసుకున్నట్టు తెలిపింది.
ఈ ఆదేశాలపై సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, భారతీయ నాగరిక సురక్షా సంహిత (Bharatiya Nagarik Suraksha Sanhita - BNS) సెక్షన్ 163 ప్రకారం జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. తదుపరి ప్రకటన వరకు అమల్లో ఉంటాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రోన్లు, పారా గ్లైడర్, మైక్రో లైట్ విమానాలను ఏగరవేయవద్దు. ఈ రకమైన ఎగురుతున్న వస్తువులు కొన్ని సందర్భాలలో ప్రమాద సంకేతాలుగా భావించవచ్చు లేదా ఆంక్షలున్న పరిస్థితుల్లో అనవసర భయాందోళనలు కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇవి భద్రతా దళాలపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చని పేర్కొన్నారు. అందుకే, నగరంలో పౌర భద్రతను మెరుగుపరచడం, శాంతియుద వాతావరణం ఉంచడం కోసం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
ఈ ఆదేశాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలపై వర్తిస్తుంది. ఈ ఆదేశాలతో భద్రతా పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు ఎలాంటి భయాందోళనలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నగరంలో ఇటీవల భద్రతకు సంబంధించి పలు హెచ్చరికలు రావడం, దేశవ్యాప్తంగా జరిగిన ఉగ్ర చర్యలతో భద్రతాపరమైన అప్రమత్తత పెరిగిన నేపథ్యంలో, ప్రజల ప్రాణ సురక్షతే తమకు ప్రథమ ప్రాధాన్యతని పోలీసు విభాగం స్పష్టం చేసింది.
భారత–పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు హెచ్చరికను జారీ చేసింది. ప్రజలు ఫిషింగ్ లింకులు, హానికరమైన APK ఫైళ్లు, నకిలీ వీడియోల నుంచి అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాష్ట్రీయ భద్రత పరంగా ఉద్భవించిన ప్రస్తుత పరిస్థితిని దుర్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రాయోజిత సైబర్ దాడుల బృందాలు, అధునాతన పర్సిస్టెంట్ థ్రెట్ (APT) గ్రూపులు, చురుకుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ గ్రూపులు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక నెట్వర్కులు, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ హానికరమైన ఫైళ్లను పంపిస్తున్నాయి.
ఈ దాడుల్లో ఉపయోగిస్తున్న ఫైళ్లలో .apk,.exe, .pdf ఫార్మాట్లలో Dance of the Hillary, Army Job Application Form, tasksche.exe వంటి పేర్లతో ఉన్నాయి. వీటిని ఓపెన్ చేసినప్పుడు స్పైవేర్, రాన్సమ్‌వేర్, మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత డేటా, బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా వివరాలను చోరీ చేసే ప్రమాదం ఉందని పోలీసు శాఖ హెచ్చరించింది.
అలాగే, ప్రజలు అధికారిక ప్రభుత్వ ఛానెళ్లను, ధృవీకరించిన వార్తా సంస్థల సమాచారాన్ని మాత్రమే అనుసరించాలనీ, నిర్ధారణలేని లేదా రెచ్చగొట్టే కంటెంట్‌ను పంచవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.