
అమ్నేషియా పబ్ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో పురోగతి చోటుచేసుకుంది. కారులో బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి.. పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను గుర్తించి సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. వీరిలో ఇప్పటికే పుప్పాలగూడకు చెందిన సాద్దుదీన్ మాలిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నేడు వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని (మైనర్) పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిన్న చీకటి పడటంతో అతడిని అదుపులోకి తీసుకోలేదని.. నేడు డే లైట్‌లోనే అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని కూడా (ఉమేర్ ఖాన్, ఇద్దరు మైనర్లు) కు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. వారిని కర్ణాటకలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్‌ను చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు అవుతుంది.
మరోవైపు ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ ధర్నాలు నిర్వహించాయి.
వారి ప్రమేయం లేదు..
ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించడం జరిగిందని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ నేరంలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. బాధితురాలి వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన ఇతర సాక్ష్యాలు ఎమ్మెల్యే కొడుకు నేరంలో ప్రమేయం లేదని చెబుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే కొడుకుకు వ్యతిరేకంగా ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని అన్నారు. విచారణ దశలో ఎక్కడైనా ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు తేలితే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణలో ఇంకా ఎవరైనా వ్యక్తుల పాత్ర కనుగొనబడితే.. వారు ఎంతటి వారైనా కేసు నమోదు చేసి, చర్యలు చేపడగామని.. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. ఇక, ఈ కేసులో హోంమంత్రి మహమూద్ అలీ మనవడి ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలు నిరాధారమని ఆయన వ్యాఖ్యానించారు.
అదే సమయంలో బాధితురాలు, నిందితులు మద్యం సేవించినట్లు కూడా పోలీసులు తోసిపుచ్చారు. ‘‘17 ఏళ్ల అమ్మాయిని ఐదుగురు యువకులు పబ్ నుంచి మొదటగా ఎరుపు రంగు మెర్సిడెస్ కారులో పేస్ట్రీ దుకాణానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బృందం ఇన్నోవా కారులోకి మారిందని.. అందులోనే బాలికపై దాడి జరిగింది’’ అని డీసీపీ తెలిపారు.
అసలేం జరిగింది..
మే 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్న తర్వాత తన కుమార్తెను (మైనర్) గుర్తుతెలియని యువకులు వేధించారని బాధితురాలి తండ్రి మే 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు విచారణ చేపట్టి.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (D), POCSO చట్టంలోని 5,6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇంకా షాక్‌లోనే బాధితురాలు..
బాధితురాలు షాక్‌లోనే ఉందని.. ఆమె నుంచి తదుపరి వాంగ్మూలాలు తీసుకుంటామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఆమెను భరోసా కేంద్రానికి పరీక్షల నిమిత్తం పంపించి నిపుణులతో కౌన్సెలింగ్ చేస్తున్నారు. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.