
తెలంగాణలో వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ నగరవాసులకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజులు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్టుగా తెలిపింది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే మూడు రోజులలో 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టుగా అంచనా వేసింది.
ఇక, సోమవారం రోజున హైదరాబాద్‌లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం ఉదయం 8:30 గంటలకు తేమ 48 శాతంగా నమోదైంది. భారత వాతావరణ విభాగం హైదరాబాద్ యూనిట్.. హైదరాబాద్‌లో రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం వరకు నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఈ వేసవిలో మంగళవారం నాడు ఈశాన్య, తూర్పు, మధ్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కోస్తా కర్ణాటక మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో మార్చి-మే మధ్య వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులే వేడిని పెంచుతున్నాయని తెలిపింది.