
హైదరాబాద్ వనస్థలిపురంలోని క్రిస్టియన్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం ఓ వివాహిత మృతిచెందగా.. అత్తింటి వేధింపులే అందుకు కారణమని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు.. 2017లో క్రిస్టియన్ కాలనీకి చెందిన దేవిరెడ్డి అనే యువకుడితో మానస వివాహం జరిగింది. అయితే మూడు రోజుల క్రితం మానస మృతిచెందింది. ఏడుపాయల దేవాలయానికి వెళ్లిన సమయంలో మానస స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు.
అయితే అత్తిడి వేధింపులతో మానస ఒత్తిడికి గురై మృతిచెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిస్టియన్ కాలనీలో మానస అత్తింటి ముందు ఆందోళనకు దిగారు. పెళ్ళైన కొద్ది రోజుల నుంచే మానస అత్తింటి వేధింపులను బంధువులు చెబుతున్నారు. ఇక, అత్తింటి వేధింపులకు సంబంధించి మానస గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.