ప్రస్తుతం టమాటా ధరలు కొండెక్కి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే క్వింటాళ్ల కొద్దీ టమాటాలను ఉచితంగా పంచిపెట్టి కూతురిపై ప్రేమను చాటుకున్నాడు ఓ హైదరబాదీ తండ్రి.
హైదరాబాద్ : సాధారణంగా పిల్లలు పుట్టినరోజున కేక్ కట్ చేయడం, చాక్లెట్లు పంచడం చేస్తుంటారు. ఇక ప్రముఖులు, రాజకీయ నాయకుల పుట్టినరోజున అభిమానులు అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ చేస్తుంటారు. కానీ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కూతురు పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా జరపాలని అనుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యులకు దూరమైన టమాటా రుచి చూపించాడు. ఒకటి రెండు కిలోలు కాదు ఏకంగా క్వింటాళ్ళ కొద్ది టమాటాలు పంచిపెట్టి కూతురి భర్త్ డే వార్తల్లో నిలిచేలా చేసాడు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పంజాగుట్ట ప్రతాప్ నగర్ ప్రాంతంతో ఎమ్మార్పిఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. నిన్న(బుధవారం) అతడి కూతురు పుట్టినరోజు. ప్రతిసారిలా కాకుండా కూతురు భర్త్ డే ను వినూత్నంగా చేయాలని శివ భావించాడు. ఈ క్రమంలో భారీగా ధరలు పెరగడంతో పేద మద్యతరగతి ప్రజలు టమాటాలు కొనడం మానేసారని గుర్తించిన అతడు వాటినే అందరికీ పంచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా భారీగా టమాటాలు కొనుగోలు చేసాడు శివ. టమాటాలు పంచిపెడుతున్న విషయం తెలిసి ప్రజలు కూడా భారీగా ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్న కూతురితో కలిసి టమాటాల పంపిణీ ప్రారంభించాడు శివ. ఒకరిద్దరికి కాదు వందలాది మందికి... ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు క్వింటాళ్లకు పైగా టమాటాలు పంచిపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు శివ.
Read More Free Tomato: ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఉచితం.. !
వంద రూపాయలకు పైగా ధర పలుకున్న టమాటాలను కూతురిపై ప్రేమతో పంచిపెట్టిన ఎమ్మార్పీఎస్ నాయకుడిని ప్రజలు అభినందిస్తున్నారు. ఆయన కూతురికి భర్త్ డే విషెస్ తెలిపి చల్లగా వుండాలని దీవించారు. వినూత్నంగా కూతురు భర్త్ డే సెలబ్రేట్ చేసి మంచి తండ్రి అనిపించుకున్న శివ పేదవారికి టమాటాల ఉచితంగా పంచిపెట్టి ఆకలిబాధను తీర్చే ప్రయత్నంచేసి మంచి నాయకుడు అనిపించుకున్నాడు.