తగ్గేదేలే అంటున్న రెబల్స్.. హ్యాట్రిక్‌పై ధీమాతో ఉన్న బీఆర్ఎస్‌ అధిష్టానానికి హెచ్చరికలు..!

Published : Jul 20, 2023, 09:47 AM IST
తగ్గేదేలే అంటున్న రెబల్స్.. హ్యాట్రిక్‌పై ధీమాతో ఉన్న బీఆర్ఎస్‌ అధిష్టానానికి హెచ్చరికలు..!

సారాంశం

తెలంగాణలో హ్యాట్రిక్‌పై కన్నేసిన అధికార బీఆర్ఎస్.. ఆ మేరకు పావులు కదుపుతుంది. అయితే పలు నియోజకవర్గాల్లో అసంతృప్తుల వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన రాజకీయా పార్టీలు గెలుపే లక్ష్యంగా  ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో హ్యాట్రిక్‌పై కన్నేసిన అధికార బీఆర్ఎస్.. ఆ మేరకు పావులు కదుపుతుంది. అయితే పలు నియోజకవర్గాల్లో అసంతృప్తుల వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన  నేతలు మరోసారి తమకు టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే చాలా నియోజవర్గాల్లో విపక్ష పార్టీల నుంచి గెలిచిన నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో చాలా కాలంగా వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అందులో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. 

ఇదిలాఉంటే, కొన్ని నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకుండా కీలక భూమిక పోషిస్తున్న పలువురు సీనియర్ నేతలు.. మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ నియోజకవర్గాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌ ఇవ్వొద్దని అధిష్టానాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. తమను విస్మరిస్తే పార్టీ విజయం సాధించడమే కష్టమని వారు చెబుతున్నారు. ఇక, మరికొంతమంది మాత్రం కొంతమంది పార్టీని విడిచిపెడతామని, తమ మద్దతుదారులను సైతం తమతో పాటు తీసుకెళ్తామని హెచ్చరికలు సైతం జారీ  చేస్తున్నారు. 

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలువురు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇటీవల పలువురు  మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో సహా సుమారు 30 మంది స్థానిక బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించి.. శంకర్‌ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. శంకర్ నాయక్‌ ప్రజల్లో ఆదరణ కోల్పోయాడని.. ఆయనకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో గెలవడం కష్టమని వారంతా వాదనలు వినిపిస్తున్నారు. ఎన్నికల్లో శంకర్‌ నాయక్‌కు టికెట్ ఇస్తే.. తాము పార్టీ కోసం పనిచేయబోమని చెబుతున్నారు. అవసరమైతే నోటాకు ఓటు వేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. శంకర్ నాయక్‌ వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వీరంతా ఎమ్మెల్సీ టీ రవీందర్‌రావు అనుచరులని తెలుస్తోంది. 

పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని నియోజకవర్గానికే  చెందిన బీఆర్ఎస్ నేత గజ్జి విష్ణు వర్గం డిమాండ్ చేస్తోంది. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌‌కు వ్యతిరేకంగా  నియోజకవర్గంలోని ‘రెబెల్స్‌’ సోమవారం సమావేశమై పార్టీ అధిష్టానం ఈసారి మరో అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది. రమేష్ తన నియోజకవర్గ ప్రజల ఆదరణను కోల్పోయారని వారు చెప్పుకొచ్చారు. ఆరూరి రమేష్‌ను రంగంలోకి దింపితే తాము పార్టీకి పని చేయబోమని హెచ్చరించారు. వరంగల్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న రమేష్.. నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం. 

ఇదిలా ఉంటే, మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావుపై, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌పై, వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే కె మాణిక్‌రావుపై, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిపై, అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై, అలంపూర్‌లో ఎమ్మెల్యే వీఎం అబ్రహం, కొత్తగూడెంలో  వనమా వెంకటేశ్వరరావుపై, పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై, మఖ్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై, నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే నోముల భగత్‌పై, మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్యపై, నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై, మహేశ్వరంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,  తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై.. ఆయా నియోజకర్గాల్లోని స్థానిక నేతలు తిరుగుబాటు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!