
Telangana BJP president Bandi Sanjay Kumar: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్ రావు (కేసీఆర్), ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ కుంభకోణాలు పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టకుండా భయపెడుతున్నాయని ఆరోపించారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఆలేరులో జరిగిన ప్రజా గోస-బీజేపీ భరోసా సభకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల వారి కుటుంబం చేస్తున్న భూ కుంభకోణాలు, ముడుపుల కారణంగా విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని విమర్శించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహా సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు భూ కుంభకోణాలకు పాల్పడి పెట్టుబడిదారులను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. పొరుగున ఉన్న కర్ణాటకకు వచ్చిన పెట్టుబడుల్లో సగం కూడా బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆకర్షించలేకపోయిందని సంజయ్ ఆరోపించారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు 150 దేశాలు ముందుకొచ్చాయని తెలిపారు. గత 75 ఏళ్లలో భారత్ కు వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 50 శాతానికి పైగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి పెట్టుబడులకు అనుకూలమైన మహా నగరం ఉన్నప్పటికీ తెలంగాణకు దేశంలో 5 శాతం పెట్టుబడులు కూడా రాలేదన్నారు. కేసీఆర్ పాలన ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని బండి సంజయ్ విమర్శించారు.
శుక్రవారం నాడు బయో ఏషియా-2023 సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందనీ, 2028 నాటికి రాష్ట్రం 100 బిలియన్ డాలర్లకు (8.2 లక్షల కోట్లు) చేరుకోవాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ను గద్దె దింపితే లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ రూ.50 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు.
"కేసీఆర్ వల్లే మంత్రి కేటీఆర్ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగారు. నిజానికి కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు తప్ప మరెవరూ సీఎం కాలేరు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా కాలేరు. కానీ బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త కూడా జాతీయ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాగలడంటూ" కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఇళ్లు లేని పేదలకు మోడీ ప్రభుత్వం 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, మోడీకి క్రెడిట్ నిరాకరించేందుకే కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని సంజయ్ ఆరోపించారు. అలాగే, దేవాలయాల అభివృద్ధి పేరుతో విలువైన భూములను కేసీఆర్ కుటుంబం కబ్జా చేస్తోందని ఆరోపించారు. యాదాద్రిలో కూడా అదే చేశారనీ, ఇప్పుడు కొండగట్టు భూములపై కన్నేశారని పేర్కొన్నారు.