
కువైట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ‘హ్యూమన్ బాంబ్’ బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపుతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అధికారులు విమానాన్ని ముంబైకి మళ్లించారు. విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే. విమానాశ్రయంలోని ఐసోలేషన్ ఏరియాలో నిలిపారు.
అప్పటికే అధికారులు విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్, సెక్యూరిటీ టీమ్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. వెంటనే పూర్తి భద్రతా చర్యలతో విమానం తనిఖీ ప్రారంభించారు. అయితే, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. దీనికి సంబంధించి ఇండిగో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
సోమవారం, మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా రోడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌కూ బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఉదయం 6.30కి వచ్చిన ఇమెయిల్‌లో, స్కూల్‌లో బాంబు పెట్టారని, అది పేల్చేస్తామని పేర్కొన్నారు. స్కూల్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ స్కూల్‌ను పూర్తిగా పరిశీలించగా, ఇది నకిలీ బెదిరింపు అని తేలింది.