
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించిన ప్రకారం, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 11కి ముందుగా వెలువడే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో జరిగిన సభలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
పంచాయతీ ఎన్నికల విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా సన్నాహాలు చేపట్టాలని, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని ఆమె ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగొచ్చని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి త్వరలో వెలువడనుంది.
బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ రిజర్వేషన్ల విషయమై స్పందించారు. సర్పంచ్ ఎన్నికలకు ముందు 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం బీసీలకు నష్టం చేయడమే అని అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలు జరిపితే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు తప్పవని హెచ్చరించారు.