
సమ్మిట్‌కు వచ్చే ప్రతి అంతర్జాతీయ ప్రతినిధికి ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విమానాశ్రయంలోనే రిజిస్ట్రేషన్, పాస్‌ల జారీ పూర్తి చేయాలని, వసతి నుంచి తిరుగు ప్రయాణం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితోపాటు భద్రతా అధికారిని నియమించాలన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెట్టుబడులకు ఆసక్తి చూపే కంపెనీల ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని తెలిపారు. నవంబర్ 15 నాటికి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
గత ఏడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కంటే ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఒక ఎక్స్పో హాల్ ఉండగా, ఇప్పుడు ఆరు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు ప్రధాన హాళ్లలో మూడు రోజుల పాటు 52 రంగాలవారీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 25 ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు, పది అధికారుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 3,500 ఆహ్వానాలు పంపించారు. వసతి, ప్రొటోకాల్, భద్రత, ప్రదర్శనల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
రక్షా ఎక్స్‌పోలో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక పరికరాలు, డ్రోన్లు, రోబోటిక్స్ ప్రదర్శించనున్నారు. వైమానిక విన్యాసాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎక్స్పో కోసం 575 సంస్థలను ఆహ్వానించగా, 49 సంస్థలు ఆసక్తి చూపాయి. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్–2026 నిర్వహించనున్నారు.
స్టార్టప్ పెవిలియన్‌లో 136 సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌లో భాగంగా వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి రంగాలకు సాంకేతిక పరిష్కారాలను ఆహ్వానిస్తున్నారు. నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన 60 కంపెనీలతోపాటు వ్యవసాయం, పాడిపరిశ్రమ, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ప్రదర్శనలు కూడా ఉంటాయి.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయుల శిల్పకళను పరిచయం చేసేలా ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయాలని సీఎం సూచించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహించనున్నారు. ‘నర్సరీ నుంచి ఆక్స్ఫర్డ్ వరకు’ తెలంగాణ విద్యారంగ ప్రస్థానం ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితులపై చర్చించేందుకు డిసెంబర్ 8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 200 మంది శాస్త్రవేత్తలు, రైతులు, నిపుణులు పాల్గొంటారు. కరవును తట్టుకునే వ్యవసాయం, పశుసంరక్షణ, తాగునీటి భద్రత, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ అంశాలపై చర్చిస్తారు. వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తక్షణ, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.
ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, గడ్డం వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల కల్పనలో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం.