ఎల్ నినో ఎఫెక్ట్ ఎంతున్నా.. హైదరాబాద్ లో నో వాటర్ ప్రాబ్లమ్ : సీఎం రేవంత్ రెడ్డి

Published : Oct 28, 2026, 06:25 PM IST
Revanth Reddy

సారాంశం

ఎల్ నినో దెబ్బకు హైదరాబాద్ లో తాగునీటి సమస్య తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో ఎలాంటి నీటిసమస్య తలెత్తకుండా సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టారు.

ఎల్ నినో ప్రభావంతో ఈ వర్షాకాలంలో పెద్దగా వానలు పడలేదు... దీంతో రాబోయే రోజుల్లో సాగు, తాగునీటి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరం హైదరాబాద్ లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు. శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాలు, పార్కులు, రోడ్ల శుభ్రత వంటి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో నీటి సరఫరాపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌ ప్రాంతంలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, శుద్ధి చేసిన నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (బుధవారం) సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

క్యూర్‌ (CURE) ప్రాంతంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను పాటించాలని, శుద్ధి చేసిన నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు.

ప్రతి ఎస్టీపీ వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని… అన్ని శుద్ధి కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్లాంట్ల పనితీరును హైడ్రా ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. ఎస్టీపీల నిర్వహణకు సౌర విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో అధికారులకు సూచించారు.

భవన నిర్మాణాల్లో ట్రీటెడ్ వాటర్ తప్పనిసరి

నగరంలో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భవన నిర్మాణాల్లో ట్రీటెడ్ వాటర్‌నే ఉపయోగించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నిబంధనల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రైవేట్ సంస్థలు మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. డేటా సెంటర్లకు కూడా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

పార్కులు, రోడ్ల శుభ్రతకు శుద్ధి చేసిన నీరు

శుద్ధి చేసిన నీటిని కేవలం ఒకటి రెండు రంగాలకే పరిమితం చేయకుండా, వివిధ అవసరాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో), ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణకు ఈ నీటిని ఉపయోగించాలన్నారు.

ప్రజా పార్కుల నిర్వహణ, రోడ్ల శుభ్రత వంటి పనులకు కూడా శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని తెలిపారు. దీనివల్ల తాగునీటిపై ఒత్తిడి తగ్గడంతో పాటు, అందుబాటులో ఉన్న నీటి వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ట్యాంకర్లపై నిఘా.. ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్

శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ట్యాంకర్ల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నీటిని పొందేందుకు ప్రజలకు సులభంగా అవకాశం కల్పించేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు.

శుద్ధి చేసిన నీటి సరఫరా, వినియోగానికి సంబంధించి ప్రజలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవస్థల నిర్వహణకు సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమల్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం 26 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నీటిని వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామని, ట్యాంకర్ల రవాణా ఖర్చు మాత్రమే వసూలు చేస్తున్నామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ఫీజుల షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభం? చివ‌రి తేదీ ఎప్పుడు.?
School Holidays : అర్నబ్ తుపాను తీరందాటినా ఆగని వర్షబీభత్సం.. ఈ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తారా?