సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి నైజీరియన్ సహా నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 303 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి నైజీరియన్ సహా నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 303 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, రాయదుర్గం పోలీసులతో కలిసి గోవా నుంచి అక్రమంగా కొకైన్ తెప్పించి నగరంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా గ్రాము కొకైన్‌ను గోవాలో రూ. 7లకు కొని.. హైదరాబాద్‌లో రూ.18 వేలకు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న 303 గ్రాముల కొకైన్ విలువ.. 1.3 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు.
ఈ డ్రగ్స్ ముఠాకు కింగ్ పిన్‌గా చింతా రాకేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న చింతా రాకేష్ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడని.. అందులో నష్టపోవడంతో.. డ్రగ్స్ వ్యాపారం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు. గోవా నుంచి కొక్తెన్ తెచ్చి సప్లై చేస్తున్నట్టు సీపీ వెల్లడించారు. ఈ కేసులో ఏ-2 నింధితుడిగా ఉన్న గాబ్రియల్ నైజీరియాకి పారిపోయాడని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసులో ఏ-4 నిందితుడు సూర్య ప్రకాష్ ని పట్టుకోవడం వల్ల డ్రగ్స్ ముఠా గుట్టు బయటపడ్డిందని చెప్పారు.
చింతా రాకేష్ లోకల్‌గా ఇద్దరు పెడ్లర్‌లను హైర్ చేసుకున్నాడని తెలిపారు. చాలాకాలంగా ఈ గ్యాంగ్ డ్రగ్స్ విక్రయిస్తోందని తెలిపారు. వాట్సాప్ ద్వారా డ్రగ్స్ క్రయవిక్రయాలను సాగించారని.. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా సంపాదించామని తెలిపారు. ఈ ముఠా నుంచి నిత్యం డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించనున్నట్టుగా తెలిపారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. నిందితుల విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.