ఎమ్మెల్సీ ఎన్నికల‌కు దూరంగా బీఆర్ఎస్..? ఎంఐఎంకు మ‌ద్ద‌తు.. !

Published : Feb 14, 2023, 12:30 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల‌కు దూరంగా బీఆర్ఎస్..?  ఎంఐఎంకు మ‌ద్ద‌తు.. !

సారాంశం

Hyderabad: 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎంఐఎం అభ్యర్థికి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీఆర్టీయూ-టీఎస్ అభ్యర్థికి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) మద్దతిచ్చింది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని వెతికే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి కూడా అదే రాజకీయ విధానాన్ని అనుసరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.  

Telangana state Legislative Council Elections: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) రెండు స్థానాలకు మార్చి 13న ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి, మరొకటి స్థానిక సంస్థల నియోజకవర్గానికి సంబంధించిన‌వి. అయితే, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) దూరంగా ఉండే అవ‌కాశముంద‌ని స‌మాచారం. బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధికారిక ప్రకటన చేయనప్పటికీ, గత ఏడాది డిసెంబర్ లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా రీబ్రాండ్ చేసిన తరువాత రాష్ట్రంలో ఇదే మొదటి ఎన్నికలు కావడంతో పోటీ చేయడానికి  అధికార పార్టీ నాయకత్వం సుముఖంగా లేకపోవడం కలకలం రేపింది. ఈ నిర్ణయానికి గల కారణాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎంఐఎం అభ్యర్థికి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ న‌గ‌ర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ-టీఎస్) అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు అంత‌ర్గ‌త పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎంఐఎం అభ్యర్థికి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీఆర్టీయూ-టీఎస్ అభ్యర్థికి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) మద్దతిచ్చింది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని వెతికే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి కూడా అదే రాజకీయ విధానాన్ని అనుసరించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ 23న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించింది. మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం వరుసగా మార్చి 29, మే 1న ముగియనుంది. 

ఇదిలావుండగా, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఈసీ 2022 డిసెంబర్ 31న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయగా, ఇందులో మొత్తం 29,501 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాల నిరంతర నవీకరణలో భాగంగా కొత్తగా 1,131 దరఖాస్తులు వచ్చాయనీ, వాటిని అధికారులు పరిశీలించి ఆమోదం తెలపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 23న విడుదల కానున్న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన సప్లిమెంటరీ ఓటర్ల జాబితా ఇది.

కాగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలతో పాటు మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

నోటిఫికేషన్ జారీ :16 ఫిబ్రవరి, 2023 (గురువారం)

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- 2023 ఫిబ్రవరి 23 (గురువారం)

నామినేషన్ల పరిశీలన: 24 ఫిబ్రవరి 2023 (శుక్రవారం)

నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ: 27 ఫిబ్రవరి 2023 (సోమవారం)

పోలింగ్ తేదీ: మార్చి 13, 2023 (సోమవారం)

పోలింగ్ సమయం : ఉదయం 08:00 గంటల నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు

ఓట్ల లెక్కింపు 16 మార్చి 2023 (గురువారం)

ఎన్నికలు పూర్తయ్యే తేదీ : 21 మార్చి 2023 (మంగళవారం)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్