Huzurabad bypoll: కాంగ్రెస్ అభ్యర్థిగా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ?

By telugu teamFirst Published Aug 12, 2021, 8:06 AM IST
Highlights

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని తెలంగాణ కాంగ్రెసు నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరును కూడా పరిశీలిస్తోంది.

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తోంది. పలువురిని పేర్లను కాంగ్రెసు నాయకత్వం పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పటికే బిజెపి, టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెసు అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది.

టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్ పేరును తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు ఖరారు చేశారు. బిజెపి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ స్థితిలో ఎవరిని పోటీకి దించితే బాగుంటుందనే విషయంపై కాంగ్రెసు నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.

మాజీ మంత్రి కొండా సురేఖ పేరును కూడా కాంగ్రెసు నాయకత్వం పరిశీలిస్తోంది. బీసీ సామాజిక వర్గాన్ని రంగంలోకి దించాలనుకుంటే కొండా సురేఖ పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు. పైగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం శనివారంనాడు కోర్ కమిటీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించింది. 

పార్టీ అభ్యర్థి ఎంపికపై ఇటీవల చర్చ జరిగింది. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి పేర్లను కూడా కాంగ్రెసు నాయకత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని రంగంలోకి దించాలనుకుంటే కవ్వంపల్లి సత్యనారాయణ పేరును ఖరారు చేయనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం కూడా ఎక్కువే. ఈ కోణంలో ఆలోచిస్తే కృష్ణా రెడ్డిని కాంగ్రెసు బరిలోకి దించే అవకాశం ఉంది. 

స్థానిక నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఖరారు చేయాలని కూడా కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. కరీంనగర్ జిల్లా నాయకుల అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

click me!