గోల్కొండ కోట వద్ద ‘పంద్రాగస్టు’ ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

By telugu teamFirst Published Aug 11, 2021, 8:42 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించడానికి గోల్కొండ కోటకు పర్యటించారు. పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న ఉదయం10.30 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఈ సందర్భంగా వివరించారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం పరిశీలించారు. పంద్రాగస్టు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించటానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు.

పరిశీలనకు గోల్కొండ కోటకు వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ వేదిక వద్దనే పోలీసులు, జీహెచ్ఎంసీ, ఆర్అండ్‌బీ, ఐ&పీఆర్, సాంస్కృతిక, రెవెన్యూ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుని అనుగుణమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం సోమేశ్‌ కుమార్‌తోపాటు టీఆర్&బీ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, పీఆర్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్) జితేందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు సీఐజీ శేషాద్రి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ప్రొటోకాల్ జాయింట్ సెక్రెటరీ అరవింద్ సింగ్, ఐ&పీఆర్ విభాగం అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఇతర పోలీసులు, జీఏడీ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నట్టు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

click me!