Huzurabad bypoll: కేసీఆర్, ఈటల రాజేందర్‌కి ప్రతిష్టాత్మకమే

By narsimha lodeFirst Published Oct 24, 2021, 2:38 PM IST
Highlights

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు కేసీఆర్, ఈటల రాజేందర్ కు సవాల్ అనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు విజయం కోసం  టీఆర్ఎస్, బీజేపీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.

కరీంనగర్:  హుజూరాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ సీఎం Kcr,  మాజీ మంత్రి Etela Rajender లకు  అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అసైన్డ్ భూములు, దేవాలయ భూములను ఆక్రమించుకొన్నారనే నెపంతో మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ భర్తరఫ్ చేశారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆయన బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్తానానికి ఈ నెల 30 ఉప ఎన్నికలు జరగనున్నాయి.

also read:Huzurabad by poll: టీఆర్ఎస్‌కి గుర్తుల టెన్షన్, పక్కా వ్యూహాంతో గులాబీ దళం

2009 నుండి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్  టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధిస్తున్నాడు. అయితే ఈ దఫా మాత్రం ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాడు.ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు ఈటల రాజేందర్ కు నెలకొన్నాయి. మరో వైపు ఈ స్థానంలో ఈటల రాజేందర్ ను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  కంకణం కట్టుకొన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో సమన్వయం చేసుకొంటూ హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్ఎస్‌యఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఆ పార్టీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడిస్తాడనే భయం కల్గించిన కాంగ్రెస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరాడు. ఈ పరిణామం కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారింది.

Huzurabad bypoll మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం కోసం Trs, Bjpలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమారు నాలుగు నెలలుగా టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ప్రధాన నేతలంతా నియోజకవర్గంలో మకాం వేశారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసి కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయంగా కేసీఆర్ పై చేయి సాధించాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు  ఈ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వానికి ఎలాంటి సవాల్ ఎదురు కాకుండా ఉండాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం కీలకమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ ప్రచారం చేసుకొనే అవకాశం లేకపోలేదు.గతంలో దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు.  దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.

ఈ ఏడాది ఆగష్టు 16న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో Dalitha Bandhu పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ విమర్శలపై టీఆర్ఎస్ కౌంటర్ చేసింది.దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసే వరకు ఈ నియోజకవర్గంలో నిలిపివేశారు. అయితే  ఈ పథకాన్ని నిలిపివేయడానికి బీజేపీయే కారణమని టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ నియోజకవర్గంలో దళితులు, బీసీ ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు.

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.10 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో సుమారు 40 నుండి 50 వేల వరకు దళిత ఓటర్లుంటారనేది అంచనా. దళితులతో పాటు బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.హుజూరాబాద్ స్థానంలో గెలుపు కోసం కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నాడని విపక్షాలు విమర్శలుచేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 50 శాతం మంది బీసీ ఓటర్లున్నారు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు  టీఆర్ఎస్ బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరల పెంపును టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు బండి సంజయ్ కు అనివార్యంగా మారింది.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి 2018 ఎన్నికల్లో 1683 ఓట్లు మాత్రమే దక్కాయి. అయితే బీజేపీ కంటే నోటాకే  అధిక ఓట్లు దచ్చాయి. నోటాకు 2867  ఓట్లు వచ్చాయని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

click me!