హుజూర్ నగర్ లో సిపిఐ మద్దతు: కేసీఆర్ కు ధీమా లేదా?

By telugu teamFirst Published Oct 1, 2019, 6:23 PM IST
Highlights

సామాన్యుడికి కలిగే ప్రశ్న ఎందుకు తెరాస సిపిఐ మద్దతు కోరుతుంది? ఇంతవరకు మాకు ప్రజల మద్దతు తప్ప ఇతర పార్టీల మద్దతు అవసరం లేదన్న కెసిఆర్ ఇప్పుడెందుకిలా సిపిఐ మద్దతు కోసం ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు. 

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఏర్పడ్డనాటి నుంచి ఏ నాడు తెరాస ఇతరపార్టీల దగ్గరకు పొత్తుకోసం వెళ్ళింది లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం కానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ తెరాస ఒంటరిగానే బరిలోకి దిగింది. 

దీనికి భిన్నంగా ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం తెరాస అగ్ర నాయకులు సిపిఐ మద్దతు కోరారు. వచ్చింది ఎవరో సాదాసీదా నాయకులు కాదు. కెసిఆర్ కి అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్, పార్లమెంటులో తెరాస సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఇంకో సీనియర్ నేత కేశవ రావు. వీరంతా విలేఖరులతో మాట్లాడుతూ, తాము కెసిఆర్ ఆదేశానుసారమే వచ్చామని చెప్పారు. 

విచిత్రమేమిటంటే సిపిఐ తెరాస దగ్గరకు వెళ్ళలేదు. సిపిఐ కన్నా ఎన్నోరెట్లు బలమైన అధికారతెరాస పార్టీ సిపిఐ గుమ్మం తొక్కింది. కమ్యూనిస్టులను తోక పార్టీలుగా పదే పదే దుయ్యబట్టే కెసిఆర్ ఇప్పుడు అదే పార్టీ మద్దతు కోరడం చర్చనీయాంశంగా మారింది. దీనితో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని ప్రెస్ మీట్లు పెట్టిమరీ చెబుతున్నారు. 

ప్రతిపక్షాల మాటటుంచితే సామాన్యుడికి కలిగే ప్రశ్న ఎందుకు తెరాస సిపిఐ మద్దతు కోరుతుంది? ఇంతవరకు మాకు ప్రజల మద్దతు తప్ప ఇతర పార్టీల మద్దతు అవసరం లేదన్న కెసిఆర్ ఇప్పుడెందుకిలా సిపిఐ మద్దతు కోసం ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు. 

తెరాస పైకి 50వేల మెజారిటీతో గెలుస్తాం, 40వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాం అని అంటున్నప్పటికీ పోటీ తీవ్రస్థాయిలో ఉండబోతుందనేది మాత్రం వాస్తవం. కమ్యూనిస్టుల ఓట్ బ్యాంకుకుండే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, చాల తేలికగా ఓట్ల బదలాయింపు జరుగుతుంది. ఈ ఓట్ల బదలాయింపు గనుక కాంగ్రెస్ కు జరిగితే తెరాసకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు.

హుజూర్ నగర్ ప్రాంతంలో దాదాపు ఒక 5 గ్రామాల్లో సిపిఐకి బలమైన పట్టుంది. హుజుర్ నగర్ పట్టణంలో కూడా ఒక రెండు మూడు కౌన్సిలర్ స్థానాల్లో గెలిచింది. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకున్నా, ఇంకా ఆ వాసనలు మాత్రం పోలేదు. ఆ పార్టీకున్న ఓటుబ్యాంకు చిన్నదే అయినా ఇంత మంది పోటీ పడుతున్నవేళ ఆ చిన్న ఓటు బ్యాంకు కూడా చాలా కీలకం. 

అదే సిపిఐ కూడా సిపిఎం మాదిరి బరిలో నిలిచుంటే తెరాస పట్టించుకునేది కాదు. సిపిఐ కూడా పోటీ చేసి ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా చీలేది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతలా చీలితే అధికార పక్షానికి అంత లాభం. వీరు ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే ప్రతిపక్ష ఓటు ఒక్కతాటిపైకి వచ్చే ప్రమాదం ఉంది. 

ప్రతిపక్ష ఓటు ఏకీకృతమైతే తెరాస కు ప్రమాదం ఏర్పడవచ్చు. ఇలా ప్రతిపక్ష ఓటు ఏకీకృతమవడం వల్లనే నిజామాబాదు పార్లమెంటు స్థానంలో కవిత ఓటమి చెందింది. 

ఎట్టిపరిస్థితుల్లోనూ, ఈ సీటును గెలిచి ప్రతిపక్షాల నోర్లు మూయించాలనిభావిస్తున్న తెరాస ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదల్చుకోలేదు. అందుకోసమే ఇలా సిపిఐ మద్దతు కోరారు. సిపిఐ కూడా తెరాస కు మద్దతు తెలపడానికి రానున్న మునిసిపల్ ఎన్నికల్లో వారితో పొత్తును కోరినట్టు సమాచారం

click me!