ఘోరం.. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే ?

By Asianet News  |  First Published May 10, 2023, 7:05 AM IST

ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి దారుణానికి ఒడిగట్టింది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు భరించలేకే ఇలా చేస్తున్నానని అంతకు ముందే తన పెద్దమ్మకు కాల్ చేసి చెప్పింది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. 


భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల కిందటే పెద్ద కుమారుడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆమె.. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మపేటకు చెందిన 38 ఏళ్ల అడపా మృదులకు.. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పాటిబండ్ల ప్రశాంత్ కు 2009లో వివాహం జరిగింది. ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవాడు. పెళ్లి తరువాత మూడు సంవత్సరాలు అమెరికాకు వెళ్లాడు. ఆ సమయంలో భార్యను కూడా తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ వారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు ప్రజ్ఞాన్‌.. ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. తరువాత హైదరాబాద్ కు వచ్చేశారు. అక్కడే హయత్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. 

Latest Videos

ముస్లిం కోటా రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలు సరికావు - సుప్రీంకోర్టు

కొంత కాలం తరువాత ఈ దంపతులకు మరో కుమారుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు మహాన్. ప్రస్తుతం 5 సంవత్సరాలు. పెద్దబ్బాయి రెండో తరగతి చదువుతుండగా.. రెండో కుమారుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో భర్త షేర్ మార్కెట్ లో, బెట్టింగ్ లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో వారికి కొండాపూర్ లో ఉన్న రూ.65 లక్షల విలువైన ఫ్లాట్ ను అమ్మేశారు. అప్పులన్నీ తీర్చేశారు. 

అయితే పెళ్లి సమయంలో మృదులకు పుట్టింటి వారు కట్నంగా ఇస్తామని చెప్పిన ఏడున్నర ఎకరాల భూమిని అమ్మి డబ్బు తీసుకురావాలని ప్రశాంత్ ఒత్తిడి ఏడాది నుంచి చేస్తున్నాడు. రూ.2 కోట్ల విలువైన జీడిమామిడి తోటను అమ్మేయాలని ఆమెతో గొడపెట్టుకుంటున్నాడు. భర్త పెట్టే బాధలను ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తోటను అమ్మకూడదని, ఇప్పటికే అన్ని ఆస్తులను అమ్మేశారని చెప్పారు. అయినా కూడా ప్రశాంత్ అదే ధోరణి కొనసాగించాడు. ఓ సమయంలో భర్తను వదిలి తమ వద్దకు వచ్చేయాలని తల్లిదండ్రులు సూచించారు.

కాగా.. ఈ క్రమంలో వారం రోజుల కిందట ప్రశాంత్ తన భార్య, పిల్లలతో కలిసి సత్తుపల్లికి వచ్చారు. జీడి మామిడి తోటను అమ్మేయాలనే ఉద్దేశంతో తన సొంత ఇంటికి వచ్చి ఉన్నారు. తరువాత భార్య మృదుల తన పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చారు. మూడు రోజుల పాటు ఉన్నారు. నాలుగు రోజుల కిందట పెద్ద కుమారుడి పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహించారు. అనంతరం విజయవాడలో ఉంటున్న తన పెద్దమ్మను ఆదివారం కలిశారు. 

విశ్వాసం చాటుకున్న శునకం..ఆత్మహత్యకు పాల్పడ్డ యజమానిని కాపాడేందుకు 4 గంటలు తీవ్రంగా ప్రయత్నించి.. చివరికి

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సోమవారం రాత్రి సత్తుపల్లికి చేరుకున్నారు. అక్కడే బస్టాండ్ నుంచి పెద్దమ్మకు కాల్ చేశారు. తన భర్త వేధింపులు భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఆటోలో అయ్యగారిపేట ప్రాంతంలో ఉన్న దామెర చెరువు వద్దకు వచ్చారు. ఇద్దరు పిల్లలతో కలిసి అందులో దూకి ఆత్మహత్యకు ఒడిగట్టారు. మంగళవారం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

click me!