యువకుడి అనుమానాస్పద మృతి: కార్పొరేటర్‌ను బంధించిన జనం.. ఖమ్మంలో ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Sep 1, 2020, 4:24 PM IST
Highlights

ఖమ్మంలో ఓ కార్పొరేటర్ పై జనం దాడికి దిగారు. కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్‌‌ను పాఠశాల గదిలో 4 గంటల పాటు బంధించారు. అక్కడితో ఆగకుండా కార్పోరేటర్ వాహనాన్ని ధ్వంసం చేశారు

ఖమ్మంలో ఓ కార్పొరేటర్ పై జనం దాడికి దిగారు. కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్‌‌ను పాఠశాల గదిలో 4 గంటల పాటు బంధించారు. అక్కడితో ఆగకుండా కార్పోరేటర్ వాహనాన్ని ధ్వంసం చేశారు.

పోలీసులు కార్పొరేటర్‌ను తీసుకెళ్లేందుకు రావడంతో జనం మరింత రెచ్చిపోయారు. ధ్వంసం చేసిన కార్పొరేటర్ వాహనాన్ని తగులబెట్టారు. పది రోజుల కిందట కార్పొరేటర్ ఇంట్లో పనికి వెళ్లిన ఆనంద్ అనే యువకుడు మృతి చెందాడు.

రామ్మూర్తి నాయక్ వల్లే ఆ యువకుడు మరణించాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని గత పది రోజుల నుంచి కార్పొరేటర్‌తో చర్చలు జరుపుతున్నారు. మరోసారి ఈ విషయంపై చర్చించేందుకు రామ్మూర్తి నాయుడు.. యువకుడి కుటుంబం వుంటున్న ప్రాంతానికి వచ్చాడు.

స్థానికంగా ఉన్న స్కూల్ ఆవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే చర్చలు జరుగుతుండగా.. యువకుడి కుటుంబం పట్ల కార్పొరేటర్ దురుసుగా వ్యవహరించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రామ్మూర్తి నాయక్‌పై దాడి చేసి స్కూల్‌లో బంధించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్కూలు దగ్గరకి వచ్చారు. ఈ క్రమంలో స్థానికులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో ఖమ్మం రెండో వార్డులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలకు నచ్చజెప్పి కార్పొరేటర్‌ను తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

click me!