జీఎస్టీ కొత్త ప్రతిపాదనలు: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

Siva Kodati |  
Published : Sep 01, 2020, 02:59 PM ISTUpdated : Sep 01, 2020, 03:00 PM IST
జీఎస్టీ కొత్త ప్రతిపాదనలు: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

సారాంశం

ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై ఆయన అభ్యంతరం తెలిపుతూ.. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.

ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై ఆయన అభ్యంతరం తెలిపుతూ.. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. కరోనా కారణంగా ఆదాయం ఘోరంగా పడిపోయిందన్న ముఖ్యమంత్రి.. కేంద్రం ప్రతిపాదనలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు.

రుణాలపై ఆంక్షలు సహేతుకం కావని... జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశాలు అభివృద్ధి చెందినట్లేనని... బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందన్నారు.

జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని.. ఈ సాంప్రదాయాలు కొనసాగించాలని కోరుతున్నానన్నారు. కాగా సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆదాయం మిగిలితే తీసుకొంటాం.. తగ్గితే అప్పు తెచ్చుకోవాలనే తీరుతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

కరోనా సాకుతో రూ. 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టాలని చూస్తోందన్నారు.మూడు లక్షల కోట్ల జీఎస్టీ బకాయిలను లక్షా 65 వేల కోట్లకు తగ్గించడం దారుణమన్నారు.

యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని ఆయన మండిపడ్డారు.  పార్టీలు మారినా రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వాల వైఖరిలో మార్పులు లేవన్నారు.

జీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రం 4 నెలల్లో  తెలంగాణ ప్రభుత్వం రూ. 8వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని మంత్రి తెలిపారు.రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన సెస్సును కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడి రాష్ట్రాలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీలో తెలంగాణ  చేరకపోతే తమ రాష్ట్రానికి రూ. 25 వేల కోట్లు అదనంగా వచ్చేవని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu