
తెలంగాణ సర్కార్ కు హై కోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల విద్యుత్ శాఖలో చేపట్టిన ఉద్యోగాల క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆ ఉద్యోగులు ఆశలు ఆవిరైపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని సూచించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇటీవల తెలంగాణ సర్కారు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 20వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ జిఓ ఇచ్చింది. దీంతో కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే అందులో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఎమ్మెల్యేలు తమ వాళ్లను నింపుకున్నారని, కొందరు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు పెట్టించారని, వారందరికీ అర్హత లేకపోయినా రెగ్యులరైజ్ అయిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లోపభూయిష్టంగా ఉందని కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. రెండేళ్లు సర్వీసు లేని వారికి కూడా క్రమబద్ధీకరించారని పిటిషనర్ తరుపున లాయర్ తెలిపారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ సర్కారు ఆనాలోచిత నిర్ణయాల కారణంగా తమకు ఉద్యోగం నోటి వద్దకు వచ్చినట్లే వచ్చి జారిపోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.