తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరడం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నేతలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో హైకమాండ్ అప్రమత్తమైంది. సమస్య పరిష్కారం కోసం సీనియర్లను ఢిల్లీకి పిలిచింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. అసలు కాంగ్రెస్ నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతుందనే వాదన వినిపించారు. దీంతో వలస వచ్చిన నాయకులు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా పరిస్థితి మారిందనే చెప్పాలి. ఇందుకు శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కిలతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. మరోవైపు తెలంగాణలో పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారిపోతుండటం, కుమ్ములాటలు మరింత ఎక్కువ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా సీనియర్ నేతలందరినీ ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో అధిష్టానం వద్దే తాడోపేడో తేల్చుకోవాలని సీనియర్లు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం పార్టీలోనే నెలకొన్న వాస్తవ పరిస్ధితులను ముక్తకంఠంతో అధిష్టానానికి వినిపించే యోచనలో సీనియర్లు వున్నారు.
Also REad : టీ. కాంగ్రెస్‌లో ముసలం .. రేవంత్‌పై సీనియర్ల తిరుగుబాటు, ఏ సమావేశం పెట్టినా బహిష్కరణే
అంతకుముందు .. రేపు పీసీసీ సమావేశం పెట్టినా బహిష్కరించాలని సీనియర్లు నిర్ణయించారు. వచ్చే మంగళవారం మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీకి మరికొందరినీ పిలవాలని నేతలు నిర్ణయించారు. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అనంతరం నేతలు వారి అజెండాను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సీనియర్ల విమర్శలకు కాంగ్రెస్ నేత మల్లు రవి కౌంటరిచ్చారు. 22 మంది పీఏసీ కమీటీలో రేవంత్ రెడ్డి తప్పించి.. టీడీపీ నుంచి వచ్చినవాళ్లు లేరని ఆయన అన్నారు. 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుంచి వచ్చినవాళ్లు వున్నారని మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ నుంచి వచ్చినవాళ్లే వున్నారని మల్లు రవి పేర్కొన్నారు. 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో ఐదుగురు టీడీపీ నుంచి వచ్చినవాళ్లేనని ఆయన చెప్పారు. డీసీసీ అధ్యక్షుల్లో ఒక్కరు కూడా టీడీపీ నుంచి వచ్చినవాళ్లు లేరని మల్లు రవి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కమిటీలో 68 శాతం.. ఓసీలకు 32 శాతం అవకాశం కల్పించామని ఆయన పేర్కొన్నారు.