నందు, సింహయాజీలెవరో తెలియదా... ఏ ఇన్నావోలో , ఎవరితో వెళ్లారో చెప్పమంటారా : రఘునందన్ రావు

By Siva KodatiFirst Published Dec 17, 2022, 7:07 PM IST
Highlights

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసుల నేపథ్యంలో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రోహిత్ రెడ్డికి డ్రగ్స్‌తో సంబంధం లేదని ఎందుకు ప్రమాణం చేయలేదని ఆయన ప్రశ్నించారు. 
 

బెంగళూరు డ్రగ్ కేసు విచారణను వేగవంతం చేయాలని మాత్రమే బండి సంజయ్ కోరారని అన్నారు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, రోహిత్ రెడ్డి, హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వాలని సంజయ్ చెప్పలేదన్నారు. నందు, సింహయాజీలు మీకు తెలియదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. వాళ్ల టెలిఫోన్ కాల్ డేటా మమ్మల్ని బయటపెట్టమంటారా అని ఆయన సవాల్ విసిరారు. మీరు ఏ ఇన్నోవాలో వెళ్లారో, ఎవరిని తీసుకెళ్లారో బయటపెడతామని రఘునందన్ రావు హెచ్చరించారు. రోహిత్ రెడ్డి ఫాంహౌస్ దళితులకు అసైన్డ్ చేసిన భూముల్లో వుందని ఆయన పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి.. నువ్వు డ్రగ్స్ తీసుకోలేదు, మరి డ్రగ్స్‌తో సంబంధం లేదని ఎందుకు ప్రమాణం చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. 

ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  భేటీ అయ్యారు. శనివారం ప్రగతిభవన్‌కు వచ్చిన రోహిత్ రెడ్డి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారునిగా ఉన్న సంగతి  తెలిసిందే. అయితే ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీచేయడం.. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని కోరడం కలకలం రేపింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి భేటీ పాధాన్యత సంతరించుకుంది. 

Also Read:  సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చర్చలు.. తాజా పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం..!

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం రోహిత్ రెడ్డి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రోహిత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో ఆ కేసుపై ప్రమాణం చేద్దామని బండి సంజయ్‌కు సవాలు విసిరారు. తాను రేపు ఇదే సమయానికి ఇక్కడికే వస్తున్నామని.. బండి సంజయ్‌ కూడా ఇక్కడకు వచ్చి తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపెట్టాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ రుజువు చేయాలని సవాలు విసిరారు. లేకపోతే బండి సంజయ్ దొంగ హిందువని తెలంగాణ ప్రజలు నమ్ముతారని అన్నారు. కర్ణాటక పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. 

బండి సంజయ్ తంబాకు తినడం మానేయాలని.. నోరు తిరగడం లేదని, ఆయన ఏం చెబుతున్నారో కూడా అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చెప్పినట్టుగానే తనకు నోటీసులు వచ్చాయని.. ఈ విషయం ఆయనకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు వస్తాయని ఢిల్లీలోని బీజేపీ నాయకులు ముందే చెబుతురాని అన్నారు. 

click me!