
హెల్మెట్ లేకుండా వాహనం (Fine for Driving without Helmet) నడపరాదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. జేబుకి చిల్లు పడేలా జరిమానాలు విధిస్తున్నా వాహనదారులు మారడం లేదు. పోలీసులు రోడ్డుపై వుంటే హెల్మెట్ పెట్టడం.. కొంచెం దూరం వెళ్లాక తీసి పక్కనబెట్టడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (hyderabad traffic police) హెల్మెట్ లేకుండా వాహనం నడపడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు.
ద్విచక్ర వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెప్పారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేందుకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికి హెల్మెట్ లేని వాహనదారులపై 11,54,463 కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ మధ్య ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టిన పోలీసులు 27,306 కేసులను నమోదు చేశారు.
Also Read:నాలుగేళ్ల చిన్నారిని బైక్‌పై తీసుకెళ్తున్నారా? మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
వాహనం నడిపే వారితో పోలిస్తే వెనుక కూర్చున్న వారికి ప్రమాదాల్లో ఎక్కువ ముప్పు చోటు చేసుకుంటుందని నగర పోలీసు కమిషనర్ (hyderabad police commissioner) అంజనీకుమార్ (anjani kumar) తెలిపారు. ఎన్నో ప్రమాదాల్లో హెల్మెట్ ధరించిన వాహనదారుడు సురక్షితంగా బయటపడగా.. హెల్మెట్ లేక వెనుకనున్న వారు మరణించినట్టు సీపీ గుర్తుచేశారు. హెల్మెట్ లేకపోతే వాహనదారుడితోపాటు, వెనుక కూర్చున్న వారికి కూడా విడివిడిగా చలాన్లు విధించనున్నట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ చెప్పారు. వాహనంపై చిన్నపిల్లలను తీసుకెళుతుంటే వారికి సైతం హెల్మెట్ పెట్టాల్సిందిగా ఆయన సూచించారు