
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో కనిష్టానికి (Temperature declining) పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఉదయం పూట పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. రాత్రిళ్లు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉత్తరం, ఈశాన్యం నుంచి వీస్తున్న చలి గాలులతో రానున్న మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మరింతగా పడిపోతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే.. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad), సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. మంగళవారం వేకువ జామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో (Ginnedari) ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్ (యూ)లో 3.8 డిగ్రీలు, అర్లి టీలో 3.9 డిగ్రీలు, వాంకిడిలో 4.9 డిగ్రీలు, జైనథ్‌లో వాంకిడి లో 4.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్ డీపీఎస్ పేర్కొంది.
Also read:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్బిణులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. చలి పంజా విసురుతోంది. వారం రోజులుగా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కురుస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మినుములూరులో 7 డిగ్రీలు, అరకులో 8 డిగ్రీలు, పాడేరులో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి.