Telangana rains: మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు.. అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ ప్ర‌భుత్వం

By Mahesh Rajamoni  |  First Published Sep 6, 2023, 9:31 AM IST

Telangana rains: తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే ఎడ‌తెరిపి లేకుండా కురిసిన వాన‌ల‌తో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వ.. వివిధ జిల్లాల కలెక్టర్లను అల‌ర్ట్ చేసింది. 
 


Heavy rains: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో చెరువులు, వాగులు నిండినందున తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నుంచి ముందు జాగ్రత్త చర్యగా కాజ్ వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. మండల స్థాయి రెవెన్యూ, పీఆర్, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించి నష్టాన్ని తగ్గించాలన్నారు. ప‌రిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనీ, బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు, వైద్యం, ఇతర నిత్యావసర సౌకర్యాలు కల్పించేందుకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.

Latest Videos

టెలికాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీకుమార్ , ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్ , అరవింద్ కుమార్ , సునీల్ శర్మ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్ , జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.

భారీ వ‌ర్షాలు కార‌ణంగా ఆరుగురు మృతి.. 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేర్వేరు వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో ఆరుగురు మరణించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో మరో ముగ్గురు గల్లంతయ్యారు.

click me!