సెప్టెంబర్ 17న 10 లక్షల మందితో సభ.. సోనియా ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారు: రేవంత్

Published : Sep 06, 2023, 09:24 AM IST
సెప్టెంబర్ 17న 10 లక్షల మందితో సభ.. సోనియా ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారు: రేవంత్

సారాంశం

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ చేసిన అభ్యర్థనను అంగీకరించినందుకు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు తెలిపింది.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ చేసిన అభ్యర్థనను అంగీకరించినందుకు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు తెలిపింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ఐదు హామీలను ఇక్కడే ప్రకటించాలని సోనియా గాంధీని అభ్యర్థించామని చెప్పారు. సెప్టెంబరు 17న నగరంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి నిరాకరించడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్‌లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ నాయకత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. తొలుత వరంగల్‌‌లో సభ పెడతామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు సెప్టెంబర్ 17న  హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తామని మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. 

పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ సభకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 2న రక్షణ శాఖకు లేఖ రాశామని  చెప్పారు. పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియం ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సభను వాయిదా వేయబోమని తేల్చిచెప్పారు. అవసరమైతే ఓఆర్‌ఆర్‌ వెలుపల బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. 10 లక్షల మందితో సభను నిర్వహిస్తామని చెప్పారు. 

సెప్టెంబర్ 17న నిర్వహించే సభ వేదికగానే సోనియా గాంధీ ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతల ద్వారా సోనియా గాంధీ ప్రకటించిన ఐదు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని  చెప్పారు. ఇక, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారని సీడబ్ల్యూసీ సమావేశం, బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షిస్తారని తెలిపారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఈ సెప్టెంబర్ 7వ తేదీతో  ఏడాది పూర్తవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించి మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల వద్ద వేడుకలు నిర్వహించాలన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తామని, వారు భారత్ జోడో యాత్ర విశిష్టతను ప్రజలకు వివరించాలని సూచించారు. 

తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ఇస్తుందన్న ప్రాధాన్యతకు అద్దం పడుతుందని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని.. సీడబ్ల్యూసీ, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??