
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం పేర్కొంది. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండంతో.. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జలాశయాల్లోకి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురవడంతో.. గోదావరి నదికి వరద పోటెత్తింది. శ్రీరాంసారగ్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు వదులతున్నారు. గోదావరి నదిపై ఇతర ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 48.60 అడుగులకు చేరింది. 11,39,230 క్యూసెక్స్ నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.
మరోవైపు హైదరాబాద్‌లో కూడా వర్షం దంచికొడుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇక, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ముక్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్.. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.