తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు : నల్గొండలో మేకల కాపరి మృతి, పలు జిల్లాల్లో పంటలు ధ్వంసం...

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 10:35 AM IST
Highlights

తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్గొండలో పిడుగుపడడంతో ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కూడా వడగళ్ల వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు జిల్లాల్లో ముఖ్యంగా కొత్తగూడెంలో పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ, నాగార్జునసాగర్ మండలంలో ఓ మేకల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. జహీరాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, గద్వాల్, జగిత్యాల, సంగారెడ్డి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండలో గురువారం రాత్రి నుండి శుక్రవారం అర్థరాత్రి వరకు అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది.

యాదాద్రి, మెదక్, మేడ్చల్, జనగాం, భోనగిరి సహా రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలు పొడిగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, మోస్తారు చినుకులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి వంటి పంటలు తుఫాను వల్ల నాశనం అయ్యాయి.  గురువారం, నల్గొండలోని నాగార్జునసాగర్‌ మండలంలో 17 ఏళ్ల మేకల కాపరి, అతని 40కి పైగా గొర్రెలపై పిడుగు పడి మృతి చెందాయి. చింతల తండాకు చెందిన గిరిజన బాలుడు సైదానాయక్ తన వర్షం పడుతుండడంతో మేకలతో పాట చెట్టుకింద తలదాచుకున్నాడు. పిడుగు పడడంతో అతడు, మేకలు మృతి చెందాయి.

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!

హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల్లో హాజరు శాతం కూడా తక్కువగా నమోదైంది. ఉపాధ్యాయుల అంచనాల ప్రకారం వర్షాల కారణంగా వచ్చే సోమవారం వరకు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడం లేదని చెప్పారు.

అమీర్‌పేట్, బషీర్‌బాగ్, మణికొండ, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి వర్షం వల్ల ఏర్డిన విద్యుత్ అంతరాయాలు శుక్రవారం ఉదయం వరకు అలాగే ఉన్నాయి. నెరెడ్‌మెట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. దీంతో నివాసితులు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడడానికి భయపడ్డారు. నగరంలోని బర్కత్‌పురా, మెట్టుగూడ వంటి కొన్ని ప్రదేశాలలో వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి, ఇది నివాసితులను ఆందోళనకు గురి చేసింది.

నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి భువనగిరి, ఖమ్మం, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. మరో మూడు  రోజులపాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

click me!