తెలంగాణలో భారీ వర్షాలు:జఫర్ ఘడ్ లో 19.2 సెం.మీ. వర్షపాతం, ఈ నెల 24 వరకు వానలు

By narsimha lode  |  First Published Jul 20, 2023, 2:37 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


 


హైదరాబాద్: రెండు  రోజులుగా  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  వర్షాలు కురుస్తున్నాయి.  జనగామ జిల్లాలోని జఫర్‌ఘడ్ లో  19.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.   ఈ నెల 24వరకు   వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  అధికారులు సూచించారు. యాదాద్రి భువనగిరి  జిల్లా  రాజాపేట మండలం పాముకుంటలో 17 సెంమీ. మెదక్ జిల్లా వెల్తుర్థిలో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

Latest Videos

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దక్షిణ తెలంగాణలోని  కొన్ని జిల్లాల్లో  వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.జూన్ మాసంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.  రెండు రోజులుగా  రాష్ట్ర వ్యాప్తంగా  వర్షాలు కురుస్తున్నాయి. అయితే  ఈ మాసంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షాల కారణంగా  ఎగువన కురుస్తున్న వర్షాలతో  గోదావరి పరివాహక ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. గోదావరి పరివాహ ప్రాంతంలో  బ్యారేజీలు, ప్రాజెక్టులకు  వరద నీరు పోటెత్తుతుంది. కడెం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. 3,608 క్యూసెక్కుల వరద నీరు  ప్రాజెక్టుకు  వస్తుంది.  ఒక గేటు ద్వారా  2,142 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా  రాష్ట్ర వ్యాప్తంగా  సింగరేణిలో   బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

సిద్దిపేట జిల్లా బస్వాపూర్ వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది.  దీంతో  రాకపోకలు నిలిచిపోయాయి.కామారెడ్డి -బ్రహ్మణపల్లి మద్య  తాత్కాలిక రోడ్డు  తెగిపోయింది. కామారెడ్డి నుండి పలు గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. కర్ణంగడ్డ తండాకు  వెళ్లే మార్గంలో  రోడ్డు కోతకు గురైంది.

నిజామాబాద్ జిల్లా లింగపూర్ వాగు ఉధృతికి  రోడ్డు ధ్వంసమైంది. డిచ్ పల్లి మండలం బర్దిపూర్ చెరువు అలుగు పోస్తుంది. భూపాలపల్లి జిల్లా కేశవపూర్ ప్రాంతంలో  లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

మరో వైపు హైద్రాబాద్ లో   కూడ రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా  రోడ్లపై వరద నీరు  చేరింది. భారీవర్షాలతో పాటు , గాలి వీయడంతో  హోర్డింగులు, భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి.  ఈ వర్షాలతో  నగరంలోని పలు ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ ల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు   రోడ్లపై  వరద నీరు నిలిచిపోవడంతో  ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం నెలకొంది.భారీ వర్షాల నేపథ్యంలో  ఇవాళ, రేపు స్కూళ్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది

click me!